అక్రమ నిర్మాణాలు సక్రమమే అనేది హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అప్రకటిత ఫిలాసఫీ అనిపిస్తుంది
హైదరాబాద్లో అడుగు తీసి అడుగేస్తే కాలు అవినీతిలో పడుతుంది .
రెండేళ్ల పాటు హైదరాబాద్ హవా సాగింది. 2014 జూన్ రెండు నుంచి మునిసిపల్ ఎన్నికల దాకా హైదరాబాద్ నగరానికి వచ్చినంత ప్రచారం దేశం లో మరొక నగరానికి వచ్చి ఉండదు. కొత్త రాష్ట్రం ఏర్పడటం, కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కొత్త స్లోగన్ ట్రూలీ గ్లోబల్, ఐటి హంగామా, టి.హబ్ ఏర్పాటు, టాటా ప్రశంసలు, అనేక అంతర్జాతీయ ఐటి కంపెనీలు రావడం.... నిత్యకల్యాణం పచ్చతోరణమే.
అయితే, మునిసిపల్ ఎన్నికల్లో టి ఆర్ఎస్ అఖండ విజయం తర్వాత అన్నీ అవాంఛనీయ సంఘటనలే. (దీనికంతటికీ కారణం ‘హమారా హైదరాబాద్’ని యాభైఏళ్ల పాటు కాంగ్రెసోళ్లు, తెలుగుదేశమోళ్లు పాలించడమే అని చెప్పిచేతులు దులుపుకోవచ్చు. అది వేరే విషయం.)
కారణమెవరైనా కానీయవండి హైదరాబాదుదంతా పైన పర్సనాలిటీ లోన మునిసిపాలిటీయే. దీనికి కారణం గత పాలన ఇంకా కొనసాగుతుండటమే. పాలన తీరు మారింది లేదు.
ఆ మధ్య వరదల్లో హైదరాబాద్ మునిగిపోయింది. నిజానికి , హైదరాబాద్ అవినీతిలో కొట్టుకుపోయిందనడం సబబు. ఎన్నికాలనీలు అక్రమంగా వెలిశాయి, వాగుల్ని వంకల్ని కభళించాయి, చెరువుల్ని మాయం చేశాయి. ఎన్ని బిల్డింగులు అక్రమంగా పుట్టుకొచ్చాయి. అవి కార్పొరేషన్ అధికారులకు తెలియకుండా వచ్చాయా.ఫెనాల్టీ వేసేటపుడు గురి తప్పకుండా నోటీసులు పంపే అధికారులకు అక్రమంగా కడుతున్న నిర్మాణాల సంగతి తెలియదా?
కొన్ని వేల నిర్మాణాలను అక్రమంగా కడుతున్నపుడు ఆ ఏరియా ఉప కమిషనర్ల మీద తీసుకున్న చర్యలేమిటి ? ఏవీ లేవు. ఎందుకంటే, ప్రతి అక్రమ నిర్మాణం వల్ల అధికారులకు సంపాదన పెరుగుతుంది. తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో కార్పొరేషన్ రెవిన్యూ పెంచుకుంటుంది. అందువల్ల అక్రమ నిర్మాణాలు సక్రమమే అనేది హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అప్రకటిత ఫిలాసఫీ అనిపిస్తుంది.
దీని ఫలితమే నానక్ రాం గూడలో నిన్న బిల్డింగ్ కూలి పోవడం. ఇది కొత్త కాదు. ఈ ఏడాది జూన్ 24 న ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఒక బిల్డింగ్ కూలిపోయింది. ఇద్దరుచనిపోయారు . అనేక మంది గాయపడ్డారు. అంతకు ముందే రామంతపూర్ అనుమతి లేని ఒక స్కూల్ బిల్డింగ్ కూలిపోయినపుడు ఇద్దరు చనిపోయారు. సెప్టెంబర్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 33 లో సరైనా నిర్మాణ నియమాలు పాటించకపోవడంతో మరొక భవనం కడుతూండగనే కూలిపోయింది. నగరంలో మ్యాన్ హోల్స్ నిర్వహణ ఎన్నిమరణాలకు దారితీసిందో లెక్కేలేదు. ఇవి ఇంకా జరగుతూ ఉండగానే నగరంలో రోడ్లు కుంగి పోతున్నాయి.
పదిలక్షల కాంపెన్సషన్ తో ఇలాంటి నగరం ‘ట్రూలీ గ్లోబల్ ’ అవుతుందా.ముందు మొదట ఈ నగరాన్ని అవినీతి అధికారుల, రాజకీయ నాయకుల చెర నుంచి బయటకు తీసుకురావాలి. అది సాధ్యమా? అంతవరకు హైదరాబాద్ లో వరదలొస్తుంటాయి. రోడ్లు కుంగిపోతూ ఉంటాయి. భవనాలు కూలిపోతు ఉంటాయి. కూలీలు, సాధారణ ప్రజలు చచ్చిపోతుంటారు. ఎక్స్ గ్రేషియా కు ఎక్కువ నిధుల కేటాయిస్తూనే ఉంటారు...
కొసమెరుపు: ఈ బిల్లింగులు కూలిపోతున్నందున, కారణమేమిటి,, ఎలా నివారించాలి అనే అంశాలను పరిశీలించేందుకు జిహెచ్ ఎం సి సెప్టెంబర్ లో ఒక నిపుణుల కమిటీ వేసింది. ఆ నివేదిక వస్తే అంతా సర్దుకుంటుందనుకుందాం.
