2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో మంగళవారం కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో 28 మంది నిర్దోషులని ప్రకటించింది. ఈ 28 మందిలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. 

2008 అహ్మదాబాద్ (ahmedabad)లో చోటు చేసుకున్న వరుస పేలుళ్ల కేసులో 13 ఏళ్ల త‌రువాత కోర్టు తీర్పువెలువ‌రించింది. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన 49 మంది దోషులుగా, 28 మంది నిర్దోషులుగా తేలుస్తూ గుజారాత్ లోని స్పెష‌ల్ కోర్టు మంగ‌ళ‌వారం తీర్పు చెప్పింది. నిర్దోషులుగా తేలిన 28 మందిలో హైద‌రాబాద్ కు చెందిన రజియుద్దీన్ నాసిర్ కూడా ఉన్నారు. 

రజియుద్దీన్ నాసిర్ (Raziuddin Nasir) హైద‌రాబాద్ (hyderabad) లోని సైదాబాద్ (sidabad) ప్రాంతానికి చెంద‌న వాడు. ఇత‌ను వహ్దత్-ఇ-ఇస్లామీ (Vahdhat -E- Islami) సంస్థ మాజీ అధ్య‌క్షుడు మౌల‌నా న‌జీరుద్దీన్ (Moulana naziruddin) చిన్న కుమారుడు. ఆయ‌న‌ 2020లో చ‌నిపోయాడు. అయితే ర‌జియుద్దీన్ ఇప్పుడు నిర్దోషిగా తేలిన‌ప్ప‌టికీ వెంట‌నే విడుద‌ల అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఆయ‌న మ‌రో క్రిమిన‌ల్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 

2008లో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ (ahmedabad crime branch) పోలీసులు నసీర్‌ను అరెస్టు చేశారు. ఇత‌ను నిషేదించిన బ‌డిన ఇండియన్ ముజాహిదీన్ (IM) స‌భ్యుడుగా ఉన్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అత‌డిపై కేసు న‌మోదు చేశారు. హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్రతో పాటు, ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద అభియోగాలు మోపారు.

జూలై 26, 2008న అహ్మదాబాద్‌లో ఉగ్రదాడి జ‌రిగింది. ఈ దాడి జరిగిన రెండు రోజుల నగరంలోని పలు ప్రాంతాల నుంచి బాంబులు స్వాధీనం చేసుకోవడంతో పాటు పోలీసులు సూరత్‌లో పదిహేను ఎఫ్‌ఐఆర్‌ (FIR)లు న‌మోదు చేశారు. అహ్మ‌దాబాద్ లో 20 ఎఫ్ఐఆర్ లు న‌మోదు అయ్యాయి. అప్ప‌టి నుంచి ఈ కేసులో కోర్టులో విచార‌ణ సాగుతోంది. మంగ‌ళ‌వారం వెలువ‌డిన తీర్పులో మొత్తం 49 మంది దోషులుగా తేలగా 28 మంది నిద్దోషులుగా తేలారు. 

అరెస్టయిన వ్యక్తులు ఉగ్రవాదుల ద్వారా శిక్షణ పొందారని సూచించే కొన్ని ఆధారాలు దర్యాప్తు బృందానికి ల‌భించాయి. కాబ‌ట్టి దీనిని ఉగ్రవాద కుట్రగా పరిగణిస్తున్నట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. వారిలో ఒకరు పావగఢ్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరంలో శిక్షణ పొందగా, మరొకరు తమిళనాడులో ఉన్నారని ఆయ‌న చెప్పారు.