హైదరాబాద్ వర్షాలు : ఎమ్మెల్యే కాలనీలో కూలిన భారీ చెట్టు, కరెంట్ స్తంభం..
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు ఎమ్మెల్యే కాలనీలో భారీ చెట్టు కూలిపోయింది. దీంతోపాటు కరెంట్ స్తంభం పడిపోయింది.
హైదరాబాద్ : హైదరాబాదులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మూడో రోజూ కొనసాగుతున్నాయి. ఈ వర్షాలకు బుధవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కాలనీలోని ఓ భారీ చెట్టు నేల కూలింది. దాని పక్కనే ఉన్న కరెంటు స్తంభం దానితోపాటు కూలిపోయింది. అయితే ఇది అర్ధరాత్రి దాటిన తరువాత కావడంతో… పెద్ద ప్రమాదం తప్పింది. చెట్టు కూలిపోవడంతో ఆ ప్రాంతంలో ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీనిమీద అధికారులు ఇంకా స్పందించలేదు. దీంతో ఆ ప్రాంతం నుంచి వెళ్లే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎడతెగని వర్షం హైదరాబాద్ ను ముసురుకుంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయి.
డబుల్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన.. పంపిణీ ఎప్పుడంటే..?
ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాడు 27.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీం, నిర్మల్, అదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రాష్ట్రంలో అత్యధికంగా 142.4 మిల్లీమీటర్ల వర్షం పడింది.
మణుగూరు మండలంలో 131.5మిల్లీమీటర్లు.. అశ్వాపురంలో 105.7 మిల్లీమీటర్లు, చర్ల, వెంకటాపురం, నవీపేట్, పినపాక, వాజేడు, దిలావర్పూర్, జఫర్గడ్, నర్సాపూర్, రేంజల్, మోస్రా, తాంసి, సిర్పూర్ (యు), నస్రుల్లాబాద్, గాంధారి, సదాశివ నగర్, కుంటాల, ఇందల్వాయి, ఏటూరునాగారం, జైనూర్, మిరుదొడ్డి, కోటగిరి, తాడ్వాయి, కుబీర్, ఇంద్రవెల్లి, డొంకేశ్వర్, ముధోల్, జైనథ్, సాలూరా, ఉట్నూరు, నిజామాబాద్, తానూరు, ఆదిలాబాద్ గ్రామీణ మండలాల్లో 61.1 నుంచి 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసిలోని చార్మినార్ ప్రాంతంలో 34.1మిల్లీమీటర్ల వర్షం పడిందని వాతావరణశాఖ తెలిపింది.
వీటితో పాటు గురు, శుక్ర, శని.. మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గురువారం నాడు సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రిలో అతి భారీ వర్షాలు కురువనున్నాయని తెలిపింది. సంగారెడ్డి, మేడ్చల్, భూపాలపల్లి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శుక్రవారం నాడు కామారెడ్డి, నిజామాబాద్ తదితరు జిల్లాల్లో… శనివారం నాడు ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి,, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.