సారాంశం

ప్రగతి నగర్‌ బాచుపల్లిలోని ఎన్నారై కాలనీలో రెండు రోజుల క్రితం మ్యాన్ హోల్‌లో పడి మిథున్ రెడ్డి (4) అనే చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

హైదరాబాద్: ప్రగతి నగర్‌ బాచుపల్లిలోని ఎన్నారై కాలనీలో రెండు రోజుల క్రితం మ్యాన్ హోల్‌లో పడి మిథున్ రెడ్డి (4) అనే చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మిథున్ నాలాలో పడి కొట్టుకుపోయాడు. బాలుడి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం డీఆర్‌ఎఫ్ సిబ్బంది తుర్క చెరువు నుంచి బయటకు తీశారు. అయితే ఈ ఘటన మిథున్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొందరు వ్యక్తులు నాలా (డ్రెయిన్) కవర్‌ను తొలగించడమే బాలుడి మృతికి కారణంగా తెలుస్తోంది. 

తొలుత ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే తదుపరి విచారణలో.. పోలీసులు సీసీ కెమెరాల ఫీడ్‌ను తనిఖీ చేశారు. అందులో మంగళవారం ఉదయం 8:20 గంటల ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఐ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వాచ్‌మెన్ మ్యాన్‌హోల్‌ను తెరిచినట్లు గుర్తించారు. రహదారిపై నిలిచిన నీరు దిగువకు ప్రవహించేలా నాలా స్లాబ్‌ను తీసివేసి.. ఆ తర్వాత దానిని గమనించకుండా అలానే వదిలివేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనకు సంబంధించి ప్రాణహాని, నిర్లక్ష్యపు చర్య సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కాలనీ ప్రెసిడెంట్‌తో పాటు వాచ్‌మెన్‌పై కేసు నమోదు చేశారు. అయితే మ్యాన్ హోల్ స్లాబ్‌లను ఇష్టానుసారం తారుమారు చేయవద్దని అధికారులు నగరవాసులను కోరుతున్నారు.