కవిత ఇంటి వైపు వెళ్లే దారుల మూసివేత: భారీ బందో బస్తు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె నివాసం వైపు వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి వెళ్లే దారులను బుధవారంనాడు పోలీసులు మూసివేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కవిత నివాసం వైపునకు వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కవిత నివాసం వైపునకు ఎవరినీ కూడా పోలీసులు అనుమతించడం లేదు.
కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి సమితి కార్యకర్తులు కవిత ఇంటి వైపునకు రాకుండా ఉండేందుకు గాను పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 11న సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ కూడా రావొద్దని కవిత కోరిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తో ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బారత్ జాగృతి సమితి ఒక్క రోజు దీక్షను చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొనేందుకు గాను భారత జాగృతి సమితి ప్రతినిధులు ఇప్పటికే ఢీల్లీకి పయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ సాయంత్రం కవిత ఢిల్లీకి బయలుదేరి వెళ్లాలి. కానీ ఈడీ నోటీసుల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం డిల్లీకి కవిత వెళ్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
also read:తెలంగాణ తలవంచదు, విచారణకు సహకరిస్తా: ఈడీ నోటీసులపై కవిత
నిన్న అరుణ్ రామచంద్రపిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత ప్రతినిధిగా తాను వ్యవహరించినట్టుగా అరుణ్ రామచంద్రపిళ్లై విచారణలో చెప్పారని ఈడీ అధికారుల తెలిపారు. అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈ అంశాలను ఈడీ అధికారులు ప్రస్తావించారు. అరుణ్ రామచంద్రపిళ్లై అరెస్టైన మరునాడే కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.