ప్రజా భవన్ లో బాంబు ... డిప్యూటీ సీఎం భట్టి ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబసమేతంగా ఈ అధికారిక నివాసంలో వుంటున్నారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో భట్టి కుటుంబసభ్యులతో పాటు భవనంలోని అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ కూడా ప్రజా భవన్ వద్దకు చేరుకుని తనిఖీ చేపట్టింది. అయితే నిజంగానే ప్రజా భవన్ లో బాంబు పెట్టారా లేక బెదిరింపు మాత్రమేనా అన్నది తెలియాల్సి వుంది.
ప్రజా భవన్ లో బాంబు పెట్టామని ... మరికాసేపట్లో అది పేలిపోతుందని హైదరాబాద్ లో పోలీస్ కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తులనుండి ఫోన్ వచ్చింది. దీంతో ప్రజా భవన్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు పంజాగుట్ట పోలీసులను అప్రమత్తం చేసారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్యాడ్ ప్రజాభవన్ కు చేరుకుని బాంబును గుర్తించే పనిలో పడ్డారు.
ఓవైపు బాండ్ స్క్వాడ్ ప్రజా భవన్ లోని భట్టి కుటుంబసభ్యులు, ఇతర సిబ్బందిని బయటకు పంపించి బాంబు వుందేమోనని తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఈ బాంబు బెదిరింపు కాల్ ఎక్కడినుండి వచ్చింది? ఎవరు చేసారు? అనేది కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరైనా ఆకతాయిల పనా లేక నిజంగానే బాంబు పెట్టారా అన్నది తేలాల్సి వుంది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం బేగంపేటలో ప్రగతి భవన్ ను నిర్మించింది. బిఆర్ఎస్ అధికారం కోల్పోయేవరకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఇందులోనే నివాసం వుంది. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్ గా మార్చింది. అంతేకాదు గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా వున్న ఈ భవనం డిప్యూటీ సీఎం నివాసంగా మారింది. భట్టి విక్రమార్క ఈ ప్రజా భవన్ లో నివాసం వుంటున్నారు.