రేపు హైదరాబాద్‌లో తెలంగాణ  బీజేపీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది. న్యూఇయర్ ఆంక్షలతో దీక్షా స్థలం మార్చుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఇందిరాపార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వేదికను మార్చినట్లుగా సమాచారం

రేపు హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది. న్యూఇయర్ ఆంక్షలతో దీక్షా స్థలం మార్చుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఇందిరాపార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వేదికను మార్చినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ దీక్ష పై ఆంక్షలు విధించారు పోలీసులు. హై కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2 వరకు రాష్ట్రం లో బహిరంగ సభలు, ర్యాలీ లు నిషేధం అంటూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే దీక్ష కు పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిషేధం అని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బీజేపీ దీక్షకి అనుమతి కష్టమని పోలీసులు తేల్చి చెప్పేసారు. 

మరోవైపు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) నిరుద్యోగుల కోసమంటూ తలపెట్టి దీక్ష సిగ్గులేని దీక్ష అని టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బిజెపి (BJP)కి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ (trs) ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు.

Also Read:దమ్ముంటే గల్లా పట్టుకుని నిలదీయి... ఆ ఉద్యోగాలెక్కడో మీ మోదీని అడుగు..: బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ

నిజం నిప్పులాంటిది. దాన్ని దాచాలని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి. మీకు ఈ సత్యం బాగా తెలిసినా, ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ దొంగదీక్షకు పూనుకున్నారు. కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

మీ ప్రభుత్వ అస్తవ్యవస్థ విధానాలతో దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్లి, కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతోపాటు, మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. మీది నిరుద్యోగ దీక్ష కాదు, పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్ష. ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు చేయడానికి ‘రాజకీయ ఉద్యోగం’ లేక చేస్తున్నదే ‘మీ నిరుద్యోగ దీక్ష.’ 

రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీయువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారు. డిగ్రీ పూర్తయిన అందరికీ ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ కల్పించలేదు. అలాగని మేం మా బాధ్యత నుంచి కేంద్రంలోని మీ ప్రభుత్వం మాదిరి ఏనాడు తప్పించుకోలేదు. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను చాటిచెప్పేలా సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించామని సగర్వంగా చెప్పగలను.