Asianet News TeluguAsianet News Telugu

దమ్ముంటే గల్లా పట్టుకుని నిలదీయి... ఆ ఉద్యోగాలెక్కడో మీ మోదీని అడుగు..: బండి సంజయ్ కి కేటీఆర్ బహిరంగ లేఖ

తెలంగాణలో నిరోద్యగ సమస్యపై దీక్ష చేయడానికి సిద్దమవుతున్న బండి సంజయ్ కి చురకలు అంటిస్తూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేేఖ రాసారు.   

ktr open letter to bjp chief bandi sanjay over employment issue
Author
Hyderabad, First Published Dec 26, 2021, 10:15 AM IST

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) నిరుద్యోగుల కోసమంటూ తలపెట్టి దీక్ష సిగ్గులేని దీక్ష అని టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బిజెపి (BJP)కి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ (trs) ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు.

కేటీఆర్ లేఖ యదావిధిగా (KTR Open Letter):  

నిజం నిప్పులాంటిది. దాన్ని దాచాలని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి. మీకు ఈ సత్యం బాగా తెలిసినా, ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ దొంగదీక్షకు పూనుకున్నారు. కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ప్రభుత్వ అస్తవ్యవస్థ విధానాలతో దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్లి, కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతోపాటు, మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. మీది నిరుద్యోగ దీక్ష కాదు, పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్ష. ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు చేయడానికి ‘రాజకీయ ఉద్యోగం’ లేక చేస్తున్నదే ‘మీ నిరుద్యోగ దీక్ష.’ 

రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీయువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారు. డిగ్రీ పూర్తయిన అందరికీ ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ కల్పించలేదు. అలాగని మేం మా బాధ్యత నుంచి కేంద్రంలోని మీ ప్రభుత్వం మాదిరి ఏనాడు తప్పించుకోలేదు. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను చాటిచెప్పేలా సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించామని సగర్వంగా చెప్పగలను. 

బండి సంజయ్ గారూ...!

ఉద్యోగ కల్పనలో మేం సాధించిన అత్యద్బుత విజయాలు మీకు తెలిసినవే అయినా తెచ్చిపెట్టుకున్న మతిమరుపుతో డ్రామా దీక్షకు దిగారు. మీ కోసం మళ్లీ ఆ విజయాలను క్లుప్తంగా గుర్తు చేస్తాను. 

ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని మించి లక్షా ముప్ఫైమూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది మా టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా... విప్లవాత్మకమైన టిఆర్ఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకువచ్చి రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన చేసింది మేము కాదా... వచ్చిన ఉద్యోగావాకాశాలను తెలంగాణ యువతకు దక్కేలా ప్రత్యేక శిక్షణ సంస్థ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్  అండ్ నాలెడ్జ్ (TASK) ని ఏర్పాటు చేసి మూడు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది మేము కాదా... టీఎస్ ఐపాస్ లెక్కలోకి రాని మరెన్నో లక్షల ఉద్యోగాలను ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా సృష్టించినది మేము కాదా... స్వయం ఉపాధి కార్యక్రమాలతోపాటు పారిశ్రామిక యూనిట్లు పెట్టుకునే వారికోసం టీఐడియా, టీప్రైడ్ వంటి విధానాలతో ప్రోత్సాహిస్తున్నది మేము కాదా... ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షల ఉద్యోగాలు కల్పిస్తూనే కోట్లాది మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేత చేసింది మేము కాదా... గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ చదువుకున్న నిరుద్యోగ సోదరీసోదరులతోపాటు, కులవృత్తులపైన ఆధారపడిన లక్షలమందికి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయూతనందించే కార్యక్రమాలు చేపట్టినది మేము కాదా...

వాస్తవాలు ఇలా ఉంటే వాటిని జీర్ణించుకోలేక బూటకపు దీక్షకు పూనుకున్న మీరు రాష్ర్ట యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించి వారి జీవితాలను నాశనం చెయ్యడానికి పూనుకుంటున్న మీకు ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో మీ వైఖరిని రాష్ర్ట యువత తరపున నిలదీస్తున్నాను. దమ్ముంటే నేను లేవనేత్తె ఈ అంశాలపైన స్పందించాలి.

దేశానికీ, యువతకూ ‘అచ్చే దిన్’అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మీ బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో చెప్పాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మీ హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలి. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా...? ఏం వివరాలు అడిగినా డేటా లేదు.. తెలియదు గుర్తులేదు.. మర్చిపోయాం అని తప్పించుకుని తిరిగే No Data Available(NDA) సర్కార్ కదా మీది. మీరు సమాధానం చెప్పలేరు. లెక్కా పత్రం లేని... జవాబుదారీతనం లేని దిక్కుమాలిన పాలన చేసే మీరు మమ్ముల్ని ప్రశ్నించడమా? పక్కాగా లెక్కలు చెప్పే పారదర్శక  పద్దతి మాది. ఎన్ని నోటిఫికేషన్లు వేసామో..  ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో డిపార్ట్మెంట్ల వారీగా వివరాలన్నీ ప్రజల ముందు ఉంచిన మా నిబద్దత ముందు పకోడీలు వేసే పనిని ఉద్యోగంగా చూపిన మీ మోడీ పాలన సాటికి వస్తుందా...

కేంద్రంలో ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మీ పార్టీ ప్రభుత్వం వల్ల తెలంగాణ యువతకు అందిన పిసరంత సాయమేమైనా ఉందా? మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా? ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా , యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా హైదరాబాదును ఇన్వెస్టర్ల డెస్టినేషన్ గా మలుస్తున్న ప్రభుత్వం మాది. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడుల స్వర్గంగా, ఉద్యోగ ఉపాధి దుర్గంగా నిలబెట్టింది మేమైతే, ఇక్కడి యువతకు ఉపాధి కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్కులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒక్కపైసా అదనపు సాయం చేయని దుర్మార్గపు సర్కారు మీది. 

కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్బుత అవకాశమైన ఐటిఐఅర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా? లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి...మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుంది. తెలంగాణ యువత మీద మాకున్నది పేగు బంధం ప్రేమ. మీలాగా ఓట్ల డ్రామా కాదు. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చిన భూమిపుత్రుల ప్రభుత్వం మాదైతే కొత్త జోనల్ విధానాన్ని ఆమోదించకుండా నెలలకు నెలలు ముప్పుతిప్పలు పెట్టిన కుటిల నీతి, కపట కేంద్ర ప్రభుత్వం మీది!

యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీది. కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది. మీ బీజేపీ పాలిత యూపీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పిడికెడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లక్షల మంది నిరుద్యోగులపై లాఠీచార్జీ చేసిన దుర్మార్గం కనిపించని కళ్లులేని కబోదులు మీరు. సాఫీగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొట్టిన మీ డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా... ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమను, ఉద్యోగులను అదుకునేందుకు అర్ధిక ప్యాకేజీలిస్తే... 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా..

సర్కారువారి పాట బెట్టి మీ ఘనమైన మోడీగారు.. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా? కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు వీఆర్ఎస్/ సీఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన మీది కాదా.. ఇన్నాళ్లు ఉద్యోగావకాశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రయివేటు పరం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల రిజర్వ్ డ్ జాబ్స్ ఎగరగొట్టిన పాపం మీకు కాక ఇంకెవ్వరికి తగులుతుంది? ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ మాదిరి పాలన  చేస్తూ ఉన్న వాటిని అమ్ముకుంటున్న మీరెక్కడా.. ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా.. ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ...

ఇక్కడ ఒక సూటి ప్రశ్న - తెలంగాణ యువత తరపున ప్రశ్నిస్తున్నాము. మీ కేంద్ర ప్రభుత్వం కానీ, మీరు అదికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లపైన ఒక శ్వేపపత్రం విడుదల చేసే దమ్ముందా... మీ బిజెపి పార్టీ అధికారం వెలగబెడుతున్న ఏ రాష్ట్రంలో నైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా? అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల వరుసలో నిలిచింది తెలంగాణ రాష్ర్టం కాదా.. బీజేపీ పాలిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో.. ఉపాధిలేక లక్షల మంది యువత బతుకుతెరువు కోసం తెలంగాణ కు వలస వస్తున్నది నిజం కాదా? ఇక్కడ పెరిగిన ఉపాది అవకాశాల నేపథ్యంలో తెలంగాణకు వస్తున్న రివర్స్ మైగ్రేషన్ నిజం కాదా...

సంజయ్ గారూ!

మీకు నిజంగానే చిత్తశుద్ధి  ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో!...  హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 లక్షల ఉద్యోగ ఖాళీలు, ప్రభుత్వ బ్యాంకులు, సాయుధ బలగాల్లోని 5 లక్షల ఖాళీలు మొత్తంగా 15లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి. ఈ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో ముందు స్పష్టం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగాలను, సంపద సృష్టించలేని మీ చేతగానితనంతో ప్రయివేటు రంగంలోనూ చతికిల పడిన మీ రిపోర్ట్ కార్డుని ప్రజల ముందు ఉంచాలి. 

మా ప్రభుత్వం  భారీస్థాయి ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్ ఫార్మాసిటీ,  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెడికల్ డివైసెస్ పార్కు, మెగా మెగా పవర్ లూమ్ పార్క్, వీవింగ్ పార్క్ వంటి మరెన్నో పారిశ్రామిక పార్కులను చేపట్టినా, వాటిలో ఒక్కదానికీ అదనపు సహాయం తీసుకురాలేని చేతకాని పార్లమెంటు ప్రాతినిధ్యం మీది కాదా... తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తుంటే పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాలని కోరినా కొర్రీలు వేసిన ప్రభుత్వం మీదే కాదా... హామీ ఇచ్చిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, మీ చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు  వివరణ ఇవ్వాలి. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి కోసం ఇచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోత్సాహం ఏమైనా ఉంటే చెప్పాలి. లేకుంటే కొలువుల భక్షకులే దొంగ దీక్షలు చేస్తామంటే కొంగలు కూడా సిగ్గు పడుతాయి. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులపై కపట ప్రేమను గుమ్మరిస్తూ రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న మీరు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోండి. నిరుద్యోగులకు, రాష్ట్ర యువతకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ కోరండి. లేకపోతే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు.

చివరగా... తెలంగాణ యువతకు ఈ సందర్భంగా ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ యువత  అకాంక్షలను సంపూర్ణంగా అర్దం చేసుకున్న ప్రభుత్వం మాది. యువతకు  ఉపాధి కల్పనలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు మా ప్రయత్నం యథావిధిగా కొనసాగుతుంది. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం చేసే అసత్య ప్రచార ప్రభావానికి లోనుకాకుండా విజ్ఞతతో అలోచించాలని కోరుతున్నాను.    


మీ,

కేటీఆర్. 

Follow Us:
Download App:
  • android
  • ios