రాజాసింగ్ కు 41(ఎ) సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు : వివరణ ఇవ్వాలని ఆదేశం
బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.
హైదరాబాద్: బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ కు 41(ఎ) సీఆర్‌పీసీ కింద పోలీసులు గురువారం నాడు నోటీసులు జారీ చేశారు.
రాజాసింగ్ కు రెండు కేసుల్లో సీఆర్ పీసీ 41(ఎ) సెక్షన్ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. షాహినాయత్ గంజ్ , మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను పురస్కరించుకొని రాజాసింగ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.శ్రీరామనమిని పురస్కరించుకొని రాజాసింగ్ రెచ్చగొట్టే పాటలు పెట్టారని రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్ పై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 19 న కేసు నమోదైంది. ఎన్నికల సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్నటి తేదీతో పోలీసులు నోటీసులు ఇచ్చారని రాజాసింగ్ చెప్పారు. మళ్లీ నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 24 గంటల్లో ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారని మీడియా రిపోర్టు చేసింది.
మునావర్ ఫరూఖీ ఈ నెల 20వ తేదీన హైద్రాబాద్ లో కామెడీ షో నిర్వహించారు.ఈ షోకు అనుమతివ్వవద్దని రాజాసింగ్ కోరారు. అయితే ఈ షో కి పోలీసులు అనుమతించారు.ఈ షో ను అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించారు.
కానీ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. దీంతో మునావర్ ఫరూఖీ షోకి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని రాజాసింగ్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే యూట్యూబ్ లో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి కించపర్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఎంఐఎం ఆరోపిస్తుంది.ఈ విషయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఈ నెల 22 రాత్రి నుండి 23వ తేదీ ఉదయం వరకు ఆందోళనలు నిర్వహించారు.
also read:తెలంగాణను శ్రీలంక గా మారుస్తున్నారు: బండి సంజయ్
హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. పాతబస్తీలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు. దీంతో ఈ నెల 23వ తేదీన ఉదయం మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. 41(ఎ) సీఆర్ పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో రాజాసింగ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 41 (ఎ)సీఆర్ పీసీ సెక్షన్ కింద ఇవాళ ఉదయం మంగళ్ హట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.