నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈడీ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ చేపట్టనున్న నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతించారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈడీ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనుంది. రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు.. ఆయనకు సంఘీభావంగా నిరసన తెలియజేయనున్నారు. అయితే హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి లభించింది. 

పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు నెక్లెస్ రోడ్డు నుంచి ఈడీ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తొలుత నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి బషీర్‌బాగ్‌‌లోని ఈడీ కార్యాలయంకు చేరుకోనున్నారు. ఇక, కాంగ్రెస్ నిరసన ప్రదర్శన దృష్ట్యా బషీర్‌బాగ్‌లో పోలీసులు భారీగా మోహరించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌తో రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. 

ఇక, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్, సోనియాలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నిరసన తెలిపేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. పోలీసులు వారి జాబితాలోని ముఖ్యనేతలను మాత్రమే ఏఐసీసీ కార్యాలయంలోకి అనుమతించారు. ఇక, నిరసన తెలుపుతున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బస్సుల్లో అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో ఆ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఏఐసీసీ కార్యాలయానికి రాహుల్, ప్రియాంక..
కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ నివాసానికి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా చేరుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియాంకలు.. పార్టీ ముఖ్యనేతలు ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లనున్నారు.