హైదరాబాద్:ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్ధనల్లో పాల్గొని నేరుగా హైద్రాబాద్‌కు వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన వారిపై హైద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ ఏడాది మార్చి నెలలో ప్రార్ధనలకు వెళ్లొచ్చిన వారు హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. హైద్రాబాద్‌లోని మల్లేపల్లిలో స్థానిక జమాత్ నాయకులు ఆశ్రయం కల్పించినట్టుగా పోలీసులు గుర్తించారు. మల్లేపల్లికి వచ్చినవారిలో విదేశీయులు కూడ ఉన్నట్టుగా కూడ పోలీసులు గుర్తించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ తబ్లిగి జమాత్ సభ్యులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తబ్లిగి సభ్యులకు ఆశ్రయం ఇచ్చారని హైద్రాబాద్ హబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.  

తబ్లిగి జమాత్ అధ్యక్షుడు ఇక్రమ్ అలీతో పాటు మరో 10 మందిపై ఏపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  కొద్ది రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక్రంతో పాటు పలువురిని క్వారంటైన్ కు తరలించారు. కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. 

నిజాముద్దీన్ నుండి వచ్చిన వారి కారణంగానే తెలంగాణలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.