Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీంపట్టణంలో బర్త్‌డే వేడుకల పేరుతో న్యూసెన్స్: బిగ్ బాగ్ ఫేం హిమజపై కేసు


హైద్రాబాద్ నగర శివారులోని ఇబ్రహీంపట్టణంలో  న్యూసెన్స్ చేస్తున్నారనే ఫిర్యాదుతో  11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడ ఉన్నారని సమాచారం. 

Hyderabad Police detained  11 For new sense  in Birth day party lns
Author
First Published Nov 12, 2023, 2:01 PM IST


హైదరాబాద్:నగర శివారులోని ఇబ్రహీంపట్టణంలో  పుట్టిన రోజు పార్టీ  పేరుతో  న్యూసెన్స్  చేయడంతో  పోలీసులు  11 మందిని అదుపులోకి తీసుకున్నారు.  స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి  వీరిని అదుపులోకి తీసుకున్నారు.  15 లీటర్ల లిక్కర్ ను పోలీసులు సీజ్ చేశారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ ఫేమ్  కు చెందిన హిమజతో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరున్నారని సమాచారం..ఈ పార్టీ నిర్వహించిన  బిగ్ బాస్ ఫేమ్  హిమజ పై  పోలీసులు కేసు నమోదు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్‌టీవీ కథనం  ప్రసారం చేసింది. అయితే  ఈ విషయమై  మీడియాలో వచ్చిన కథనాలపై  హిమజ స్పందించారు.  మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చారు. దీపావళి సందర్భంగా నిర్వహించిన  పార్టీ విషయమై  కొందరు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చారని ఆమె  సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు.  మీడియాలో రకరకాల కథనాలు సరికాదన్నారు. రేవ్ పార్టీ అంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. 

గత కొంతకాలంగా  హైద్రాబాద్ నగర శివార్లలో  వీకేండ్లలో  ఈ తరహా  పార్టీలు సాగుతున్నాయి.హైద్రాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌస్ లు, రిసార్టులలో  పెద్ద ఎత్తున  పార్టీలు జరుగుతున్నాయి.  కొన్ని ఫామ్ హౌస్ లలో  డ్రగ్స్ కూడ  విక్రయిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో  ఫామ్ హౌస్ లు, రిసార్ట్స్ పై  పోలీసులు నిఘాను పెంచారు. అంతేకాదు వీటిపై  దాడులు నిర్వహిస్తున్నారు.

ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే  ఆరోపణలు కూడ వస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగిన సమయంలోనే  దాడులు నిర్వహించి పోలీసులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు కూడ లేకపోలేదు. అయితే  వారాంతపు రోజుల్లో  జరిగే మద్యం పార్టీలపై  పోలీసులు నిఘాను పెంచాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు కోరుతున్నాయి.  

ఫామ్ హౌస్ లలో  గుట్టుచప్పుడు కాకుండా  పేకాట సహా ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడ లేకపోలేదు.  అయితే  టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పుడప్పుడూ  ఫామ్ హౌస్ లపై దాడులు నిర్వహిస్తున్నారు.  హైద్రాబాద్ నగరంలోని  పబ్ లపై కూడ పలు దఫాలు ఆరోపణలు వచ్చాయి. దీంతో  పబ్ ల విషయమై  కొందరు  హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు హైద్రాబాద్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల నేపథ్యంలో పబ్ లలో  పోలీసుల తరచుగా  సోదాలు నిర్వహిస్తున్నారు. మైనర్లకు  పబ్ లలోకి అనుమతిని ఇవ్వవద్దని కూడ  ఆదేశాలున్నాయి. అయితే కొన్ని చోట్ల పబ్ లలో  యధేచ్చగా  నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయాన్ని మహిళా సంఘాలు  ఆరోపణలు చేస్తున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios