Hyderabad: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ లోని నివాసానికి తరలించారు. అయితే, ఆమె అరెస్టుపై స్పందిస్తూ.. మహిళ దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
YSRTP chief YS Sharmila: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ట్యాంక్ బండ్ వద్ద షర్మిల, ఆమె సహచర కార్యకర్తలు చేపట్టిన మౌనదీక్షను పోలీసులు భగ్నం చేశారు. మౌన దీక్షను అడ్డుకున్న పోలీసులు.. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ లోని నివాసానికి తరలించారు.
వివరాల్లోకెళ్తే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ రోడ్డులోని రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్షకు దిగారు. నోటికి మాస్క్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేరాలు, దౌర్జన్యాల రూపంలో రాష్ట్రం మహిళల కోసం ల్యాండ్ మైన్స్ గా మారిందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవి ఎప్పుడు పేలుతాయో ఎవరికీ తెలియదనీ, కేసీఆర్ కు ఆయన కూతురు మాత్రమే మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తోందనీ, మద్యం కుంభకోణంలో ఇరుక్కుని మహిళలను అవమానానికి గురిచేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు దీక్షను అడ్డుకునీ, వెంటనే అదుపులోకి తీసుకుని వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని నివాసానికి తరలించారు.
కవితపై విమర్శలు గుప్పిస్తూ.. ఆడబిడ్డ అయి ఉండి తెలంగాణ తలదించుకునేట్టుగా లిక్కర్ స్కామ్‌లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. బతుకమ్మ ముసుగులో కవిత లిక్కర్ స్కామ్ చేసిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తన దగ్గరకు వస్తున్న క్రమంలోనే మహిళ 33 శాతం రిజర్వేషన్ కోసం కొట్లాడతామని అంటున్నారని విమర్శించారు. అధికార టీఆర్ ఎస్ నేతలు మహిళలపై నేరాలకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. కేటీఆర్ నియోజకవర్గంలో మైనర్లపై అత్యాచారాలు జరిగాయని అన్నారు. "రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పట్టపగలు అత్యాచారాలు జరుగుతున్నాయి. దళిత మహిళలపై దాడులు, లాకప్ లలో హత్యలు చేస్తున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదంటూ" ఫైర్ అయ్యారు.
మహిళలకు ఆయన ఇచ్చిన హామీలు నిజంలేదనీ, కేటీఆర్ ప్రకటించిన భరోసా యాప్ ఎక్కడ? ఉందని ప్రశ్నించిన షర్మిల.. స్వయంగా తాను దానిని పరీక్షించుకుంటే పనిచేయలేదని అన్నారు. గవర్నర్ ను కూడా వదిలిపెట్టలేదని, ఓ ఎమ్మెల్సీ తనపై అసభ్య పదజాలంతో దూషించారని మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరసిస్తూ.. ట్యాంక్ బండ్ వద్ద మౌన దీక్ష నిర్వహిస్తుంటే.. ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే కేసీఆర్ సర్కారు పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. "మహిళల పక్షాన గొంతెత్తితే బలవంతంగా అరెస్ట్ చేస్తారా? మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకు మీరిచ్చే గౌరవం ఇదేనా? సొంత పార్టీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడినా మేలుకోడు కేసీఆర్. అత్యాచారాలు,లైంగిక వేధింపుల్లో దక్షిణ భారతంలోనే తెలంగాణను నం.1 స్థానంలో నిలిపిన దొరను, మహిళా లోకం ఎన్నడూ క్షమించదు" అంటూ ట్వీట్ చేశారు.
