సోషల్ మీడియా వేదికగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల ఫ్లాట్ ఫాంలలో పరిచయం చేసుకుని, వారి స్థితి గతులను తెలుసుకుని ఆ తరువాత నెమ్మదిగా వారిని దోపిడీకి గురి చేస్తున్నారు. ఇలాంటి ఓ అంతరాష్ట్ర ముఠాను ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ఆకలవుతుందని చెప్పి,  ఇంటికి వచ్చి అతన్ని బంధించి సొత్తును దొంగిలించారు ఈ నేరస్తులు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి  వద్ద రూ.26 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాదీనం చేసుకున్నారు. 

ఎల్‌బీనగర్‌లో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపి వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన  నిఖిల్, వినయ్‌ చౌదరి, ఉదయ్‌ కుమార్,  బ్రహ్మ తేజలు చిన్న నాటి స్నేహితులు. నలుగురూ నేరాల బాట పట్టారు. 

ఈ క్రమంలో వనస్థలిపురంలో స్వచ్చంద హెల్ప్‌ కిడ్స్‌ హ్యాపీ కిడ్స్‌ అనే సంస్థ నడిపే సతీష్‌తో ఇన్‌స్ట్రాగామ్‌ లో పరిచయం పెంచుకున్న నిఖిల్‌ అతని ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత స్నేహితులతో కలిసి సతీష్‌ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. 

ఈ క్రమంలో నిందితులు బొమ్మ పిస్టల్‌ తీసుకొని వచ్చారు.  ఈ నెల 15వ తేదీన  వనస్థలిపురంలో నివాసముండే సతీష్‌ ఇంటికి ఆకలేస్తుందని చెప్పి నలుగురూ వచ్చారు. హఠాత్తుగా సతీష్‌పై దాడి చేసి నోరు మూసి తాడుతో చేతులు కట్టి బొమ్మ పిస్టల్‌తో బెదిరించారు. ఇంట్లో ఉన్న రూ.1.18 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్‌ ఫోన్లు, సిల్వర్‌ నెక్లెస్‌ దోపిడీ చేశారు. 

తరువాత బళ్లారికి పారిపోయారు. సతీష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కానీ వాళ్లు దొరకలేదు. అయితే మళ్లీ నేరం చేసేందుకు సోమవారం శంషాబాద్‌కు వచ్చారు. నిందితులపై నిఘా ఉంచిన ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.26 విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.