టీఎస్‌పీఎస్‌సీ వైపు వెళ్తున్న బండి సంజయ్ అరెస్ట్: సొమ్మసిల్లిన బీజేపీ కార్యకర్త
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు శుక్రవారంనాడు గన్ పార్క్ సమీపంలో అరెస్ట్ చేశారు. గన్ పార్క్ నుండి టీఎస్‌పీఎస్ సీ వైపు వెళ్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ తో గన్ పార్క్ వద్ద బండి సంజయ్ దీక్షకు దిగారు. దీక్ష పూర్తైన తర్వాత టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు ఎలా జరగిందో టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్, కమిషనర్ ను కనుక్కొంటానని బండి సంజయ్ ప్రకటించారు. గన్ పార్క్ నుండి టీఎస్‌పీఎస్‌సీ వైపుకు బండి సంజయ్ బయలు దేరారు. వాహనాలు మారి టీఎస్‌పీఎస్‌సీ వైపు బండి సంజయ్ వెళ్లే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ ను పోలీసులు టీఎస్‌పీఎస్‌సీ వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.
బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండా మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఓ బీజేపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు.. మరో వైపు బండి సంజయ్ దీక్షకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలను నిరసిస్తూ అసెంబ్లీ ముందు బీజేపీ శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గన్ పార్క్ వద్ద ఉన్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.