తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే భారీ వర్షం నేపథ్యంలో నీరు నిలవడంతో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు 2, 7 ఎగ్జిట్ పాయింట్ల మూసివేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకంటించారు. వీలైనంత త్వరగా తెరవడానికి వాటిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడకు వెళ్లే ఎదులనాగులపల్లి వద్ద ఎగ్జిట్ నెం. 2, శామీర్‌పేట సమీపంలోని ఎగ్జిట్ నెం. 7 రెండింటి వద్ద ట్రాఫిక్‌ను అనుమతించడం లేదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఎగ్జిట్ నెంబర్ 7కు బదులు ఎగ్జిట్ నెంబర్ 6 లేదా ఎగ్జిట్ నెంబర్ 8ను వినియోగించాలని కూడా సూచించారు. ఇదిలా ఉంటే.. మూసీ నది ఎగువన ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ల నుంచి నీటిని విడుదల చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ రాజు కేవీపీ పేర్కొన్నారు. మూసీ ఒడ్డున నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని మరియు పోలీసు అధికారులు, సివిల్ అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయి.
గత కొద్ది రోజులుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీరు విడుదలవుతున్నందున మూసీ నది నీటిమట్టం పెరుగుతుండడంపై పరివాహక ప్రాంతంపై అధికారులు నిఘా ఉంచారు. మూసీ నదిపై ఉన్న వంతెనల మీదుగా వెళ్లే వారు వరద పరిస్థితిని గమనించాలని కోరారు. మూసీ ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖల అధికారుల సూచనలను పాటించాలని కోరారు.
మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ కాజ్‌వే (చిన్న వంతెన) వంతెనల వద్ద నీటి మట్టాలు దాదాపు వంతెనను తాకడంతో అధికారులు చుట్టుపక్కల నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు.
