హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. క్రికెట్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని క్రీడాభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే క్రికెట్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని క్రీడాభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. నాగోల్- రాయదుర్గం మార్గంలో ఎక్కువ మెట్రో రైళ్లు నడపనున్నట్లు హెచ్‌ఎంఆర్ తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నాగోల్-రాయదుర్గం మార్గంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏడు నిమిషాలకు బదులుగా ఐదు నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
అలాగే సాయంత్రం 4 నుంచి 10 గంటల మధ్య నాలుగు నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లను నడపనున్నట్టుగా తెలిపింది. ఇక, నాగోల్‌లో రెండు రైళ్లను సిద్ధంగా ఉంచుతామని.. రాత్రి 9 గంటల తర్వాత రద్దీ ఎక్కువగా ఉంటే అదనపు రైళ్లను నడపనున్నట్టుగా పేర్కొంది. మరోవైపు స్టేడియం మెట్రో స్టేషన్‌లో నాలుగు కౌంటర్లకు బదులుగా ప్రతి వైపు ఐదు కౌంటర్లతో పది కౌంటర్లు నిర్వహించనున్నారు. ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్‌లో కూడా సాధారణ రెండు కౌంటర్లకు అదనంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం స్టేషన్‌లో అదనపు భద్రతతో రెండు వైపులా బ్యాగేజీ స్కానింగ్ చేపట్టనున్నారు. ఇక, నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు హెచ్‌ఎంఆర్ తెలిపింది.
