ప్రస్తుతం తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలో నేరాలు, దొంగతనాలు తగ్గాయని ఇటీవల అధికారులు చెప్పారు.  అయితే.. తాజాగా.. ఓ భారీ చోరీ నగరంలో చోటుచేసుకుంది.

న‌గ‌రంలోని ప్ర‌ముఖ క‌రాచీ బేక‌రీని లూటీ చేశారు. బేక‌రీలో చోర‌బ‌డ్డ దొంగ‌లు లోప‌లున్న న‌గ‌దుతో ఊడాయించారు. పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలోని ఓ భవనంలో కరాచీ బేకరీ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా పోలీసుల ఆంక్షలకు అనుగుణంగా అప్పుడప్పుడూ మాత్రమే ఈ బేకరీని తెరుస్తున్నారు.

అయితే బుధవారం ఉదయం బేకరీని తెరిచిన యజమానులు లాకర్‌ పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు. అందులో ఉండాల్సిన రూ.10లక్షల నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. భవనం మధ్యనున్న చిన్న సందు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.