లారీ దూసుకువెళ్లడంతో... ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జహంగీర్(45)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను మద్యానికి బానిస కావడంతో.. అతనిని  భార్య 12 సంవత్సరాల క్రితం వదిలేసి వెళ్లిపోయింది. దీంతో.. అతను తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. 

గతంలో అతను లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అయితే నిత్యం మద్యం సేవించి ఉండటంతో.. అతనిని పనిలో నుంచి తీసేశారు. గురువారం జహంగీర్ తన ఇంటి ముందు నిద్రిస్తుండగా... ఓ లారీ అదుపుతప్పి దూసుకుపోయింది. ఈ ఘటనలో జహంగీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.