Hyderabad: బిల్కిస్ బానో కేసు పై స్పందించిన మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా గుజరాత్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జోక్యంతోనే బిల్కిస్ బానో కేసు దోషులు విడుదలయ్యారని ఎంఐఎం ఆరోపించింది.  

Telangana Minister KT Rama Rao: 2002 గుజ‌రాత్ అల్లర్ల స‌మ‌యంలో ఒక కుటుంబంపై క్రూరంగా దాడి చేయ‌డంతో పాటు ఐదు నెల‌ల గ‌ర్బిణిపై సామూహిక అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల‌ను ఇటీవ‌ల గుజరాత్ స‌ర్కారు విడుద‌ల చేసింది. దీనికి గుజ‌రాత్ స‌ర్కారుతో పాటు కేంద్ర హోం శాఖ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే క్రూర‌మైన హ‌త్య‌లు, సామూహిక లైంగిక‌దాడుల‌కు పాల్ప‌డిన నిందితుల‌ను విడుద‌ల చేయ‌డ‌మేంట‌ని బీజేపీ ప్ర‌భుత్వాల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్యక్త‌మ‌వుతోంది. పౌర సంఘాలు, రాజ‌కీయ వ‌ర్గాలు దోషుల విడుద‌ల‌పై ప్ర‌భుత్వ నిర్ణ‌యం స‌రైందికాద‌ని మండిప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ మంత్రి కే.టీ.రామారావు (కేటీఆర్) కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, గుజ‌రాత్ ప్ర‌భుత్వాల‌పై మండిప‌డ్డారు. 

బిల్కిస్ బానో కేసు పై స్పందించిన మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా గుజరాత్ రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేసిందని మంగళవారం కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా పాలనలో ఇది 'కొత్త పతనం' అని ఆయన అభివర్ణించారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను కేంద్రం ఆమోదించిన తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ నేప‌థ్యంలో కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, ఇది షాకింగ్ విష‌య‌మ‌ని పేర్కొన్నారు. 

“షాకింగ్!! "సంస్కారీ రేపిస్టులను" గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిందని అంతా నివేదించబడింది. వాస్తవానికి దీనిని ఆమోదించింది కేంద్ర ప్రభుత్వమే! సిగ్గుచేటు, అసహ్యకరమైన విష‌యం.. రేపిస్టులను, పిల్లలను చంపేవారిని రాజకీయ ప్రయోజనాల కోసం వదిలిపెట్టడం బీజేపీ ప్రమాణాల కంటే తక్కువ స్థాయికి కూడా దిగజారింది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సీబీఐ, స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ముంబ‌యి, స్పెషల్ జడ్జి (సీబీఐ) ముంబ‌యి.. దోషుల శిక్షల ఉపశమనాన్ని వ్యతిరేకించగా.. హోం మంత్రిత్వ శాఖ ఖైదీలను త్వరగా విడుదల చేయాలని అభ్యర్థించిన‌ట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2002 నాటి బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో, గుజరాత్ అల్లర్ల సమయంలో ఆమె ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించి, విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను నవంబర్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన సమాధానాన్ని అన్ని పక్షాలకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌కు సమాధానం ఇవ్వడానికి పిటిషనర్లకు సమయం ఇచ్చింది.

కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత బిల్కిస్ బానో రేపిస్టులను ముందుగానే విడుదల చేసినట్లు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. "ఈ వ్యక్తులు క్రూరమైన అత్యాచారం & హత్యకు పాల్పడ్డారు. 3 ఏళ్ల చిన్నారి తలపై బండరాయితో కొట్టారు. కేవలం ముస్లింల కారణంగానే వారిని చంపారు. బీజేపీకి, బాధితులు ముస్లింలైతే ఏలాంటి నేర‌మైన‌ తీవ్రం కాదు" అని ఆయ‌న ట్వీట్ చేశారు.