Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ మీర్ ఆలం చెరువుపై రెండో కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్ లో రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కానుంది.  మీర్ ఆలం చెరువుపై చింతల్మెట్ రోడ్డు నుంచి బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

Hyderabad is the second cable bridge over Mir Alam pond..ISR
Author
First Published Mar 12, 2024, 11:26 AM IST

హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీర్ ఆలం చెరువుపై చింతల్మెట్ రోడ్డు నుంచి బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు రూ.363 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. మీర్ ఆలం చెరువుపై నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన  తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపుతూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పని. దీని వల్ల మీర్ ఆలం ట్యాంక్ చుట్టుపక్కల జీవనోపాధిని మెరుగుపడుతుంది. దీంతో పాటు ప్రజలకు వినోదాన్ని అందిస్తుంది. ఈ కేబుల్ బ్రిడ్జి ప్రయాణికులకు కూడా సహాయపడుతుందనడంలో సందేహం లేదు’’ అని పేర్కొన్నారు.

మీర్ ఆలం చెరువుపై 2.65 కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జి కోసం భూ సేకరణ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు హైదరాబాద్ లో పర్యాటకం పెరుగుతుంది. కాగా.. మూసీ నదికి దక్షిణంగా ఉన్న మీర్ ఆలం చెరువుకు హైదరాబాద్ సంస్థానం మాజీ ప్రధాని మీర్ ఆలం బహదూర్ పేరు పెట్టారు. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల ఏర్పాటుకు ముందు హైదరాబాద్ వాసులకు ప్రధాన తాగునీటి వనరుగా ఉండేది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న హైదరాబాద్ మొదటి కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో కలుపుతుంది. దీని వల్ల ప్రయాణ సమయం ఎంతో తగ్గింది. మీర్ ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్ కు రెండో తీగల వంతెన అందుబాటులోకి వస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios