అరుదైన గిన్నిస్ రికార్డ్ సాధించిన హైదరాబాద్ చిన్నారి శ్రీహాస..
తొమ్మిదో తరగతి చదువుతున్న జే.వి. శ్రీహాస అరుదైన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. కరోనా సమయంలో దొరికి ఖాళీని సద్వినియోగం చేసుకుని ఆన్లైన్ లోనే తైక్వాండ్ నేర్చుకుని ఈ ఘనత సాధించింది.
హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన ఓ చిన్నారి తైక్వాండోలో గిన్నిస్ రికార్డ్ సాధించి, అందరి మన్ననలు అందుకుంటోంది. కేవలం 23 నిమిషాల్లో రెండు వేలకు పైగా తైక్వాండో కిక్స్ కొట్టి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్రుష్టించింది. ఆ చిన్నారి హైదరాబాద్ సైనిక్ పురికి చెందిన 13 ఏళ్ల జె.వి. సాయి శ్రీహాస. భవన్స్ సైనిక్ పురి స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి జె.వి. శ్రీరాం, తల్లి జె.వి. పావని. అంతకు ముందు తైక్వాండోలో బ్లూ బెల్ట్ కూడా సాధించింది.
శ్రీహాస నాగాయలంకకు చెందిన ఈశ్వర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్, విశ్వల శిక్షణలో రాటు తేలింది. దీంతో శ్రీహాస 23 సెట్లలో 2005 తైక్వాండో కిక్స్ కొట్టి పాత రికార్డ్స్ బద్దలు కొట్టింది. చిన్నారికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ తో పాటు మెడల్, మెమొంటోలను గ్రాండ్ మాస్టర్ ఈశ్వర్ అందించారు. తన తల్లిదండ్రులు పావని, శ్రీరామ్ ల ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించగలిగానని చిన్నారి శ్రీహాస పేర్కొంది. శిక్షణను ఇచ్చిన గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్, విశ్వలను విద్యార్ధుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, గురుపూజ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ లో భారీ వర్షం.. మిద్దె కూలి దంపతుల మృతి...
శ్రీహాస తండ్రి శ్రీరామ్ జర్నలిస్ట్, వార్త, సాక్షి, జీ న్యూస్ ఛానల్స్ లో పనిచేశారు. ప్రస్తుతం ఇఫ్లూలో ఇఎమ్మెమ్మెఆర్సీలో వాగేష్ అనే ఛానల్ నిర్వహిస్తున్నారు. తల్లి పావని గృహిణిగా ఉంటూనే, జీ తెలుగు ఛానల్ లో ఫ్రీలాన్సర్ గా వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. శ్రీహాసకు ఒక తమ్ముడు. పేరు శ్రీ అనిరుధ్. మూడోతరగతి చదువుతున్నాడు. అక్క బాటలోనే ఈ చిన్నారి కూడా తైక్వాండోలో గ్రీన్ బెల్ట్ సాధించాడు. సంగీతంలో బృందగాన కచేరీలు చేస్తున్నాడు. పియానో కూడా వాయిస్తాడు.
శ్రీహాస గిన్నిస్ వరల్డ్ కు ప్రయత్నించడం ఇదే తొలిసారి అని తండ్రి శ్రీరామ్ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఆన్ లైన్ లోనే తైక్వాండో నేర్చుకుందని తెలిపారు. తండ్రి ప్రోద్భలంతోనే ఇది సాధ్యమయిందన్నారు.