హైదరాబాద్‌కు చెందిన ఓ రోబోటిక్స్ సంస్థ అర్టిఫిఫియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే అత్యాధునిక అటానమస్ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో ఈ తరహా వ్యవస్థను రూపొందించడం ఇదే తొలిసారి. 

ఆయుధాలు, రక్షణ రంగ ఉత్పత్తుల పరంగా స్వయం సమృద్ధిని సాధించాలని ఇండియా కృత నిశ్చయంతో వున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఓ రోబోటిక్స్ సంస్థ అర్టిఫిఫియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే అత్యాధునిక అటానమస్ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ఈ వ్యవస్థ అణు వ్యవస్థాపనలు, చమురు రిగ్‌లు వంటి కీలక ప్రదేశాల వద్దే కాకుండా డ్రోన్‌ల నుంచి మొత్తం నగరాన్ని కవర్ చేస్తుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో ఈ తరహా వ్యవస్థను రూపొందించడం ఇదే తొలిసారి. 

ఈ అధునాతన ఫుల్ స్పెక్ట్రమ్ డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్ సామర్ధ్యాన్ని హైదరాబాద్ శివార్లలో ప్రత్యక్షంగా ప్రదర్శించింది గ్రీన్ రోబోటిక్స్ సంస్థ. ఈ కంపెనీకి ఏఐ ఆధారిత భద్రతా పరిష్కారాలను అందించడంలో ప్రత్యేకత వుంది. దీనికి ‘‘ఇంద్రజాల్’’ అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే ఏకైక వైడ్ ఏరియా కౌంటర్ అన్ మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (సీ యూఏఎస్)గా నిపుణులు చెబుతున్నారు. ఇది స్టాటిక్ డిఫెన్స్ సిస్టమ్‌లతో పరిష్కరించలేదని కదిలే థ్రెట్‌లకు తక్షణం స్పందిస్తుంది. 

2014 నుంచి 2016 వరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేసిన ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ మాట్లాడుతూ.. దీనిని రక్షణ, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ రంగాల్లో భారతదేశ భద్రతా సవాళ్లకు భవిష్యత్ పరిష్కారంగా ‘ఇంద్రజాల్’ను పేర్కొన్నారు. గ్రీన్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు కిరణ్ రాజు మాట్లాడుతూ.. ఇంద్రజాల్ డిజైన్ కృత్రిమ మేథస్సుతో నడిచే 12 ప్రత్యేక లేయర్‌ల సాంకేతికతను అందించే కాంబినేషన్ మెకానిజంను ఉపయోగిస్తుందన్నారు. ఇది 360 డిగ్రీల కోణంలో రక్షణను అందిస్తుందని రాజు చెప్పారు. 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అన్ని తరగతులకు చెందిన డ్రోన్‌లను ఇంద్రజాల్ ఎదుర్కొంటుందన్నారు.