తనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని దిశ హత్య కేసు నిందితుడు చెన్న కేశవులు భార్య డిమాండ్ చేస్తోంది. గత నెల 27 వ తేదీన దిశ అనే వెటర్నరీ డాక్టర్ పై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి... అనంతరం సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. బలవంతంగా మద్యం తాగించి.. పథకం ప్రకారం  ట్రాప్ చేసి మరీ హత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

ఎన్ కౌంటర్ తర్వాత కూడా... నిందితులను మృతదేహాలను ఇంకా వారి కుటుంబసభ్యులకు అప్పగించలేదు. ఈ విషయమై ఓ మీడియా సంస్థ నిందితుల కుటుంబసభ్యులను సంప్రదించింది. ఎన్ కౌంటర్ పై మీరు  ఏమంటారు.. అని ప్రశ్నించగా... తమ బిడ్డలను అన్యాయంగా చంపేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు.

అయితే... చనిపోయిన నలుగురు నిందితుల కుటుంబ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. తమ కుటుంబాలకు వారే ఆధారమని... ఇప్పుడు వాళ్లు పోయాక తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా.... నిందితుల్లో ఒకరైన చెన్న కేశవులు భార్య మాత్రం తనకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

 ఇప్పటి వరకు ఎంతో మంది నేరాలు చేశారు కానీ, వారిని ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయలేదని, తన భర్తనే ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.  పోయిన తన భర్త ఎలాగూ రాడుకాబట్టి కనీసం తనకైనా ఉద్యోగం ఇవ్వాలని కోరుతోంది.

ఇదిలా ఉంటే... ఇప్పటికే చెన్న కేశవులు మైనర్ అనే విషయం ఎన్ హెచ్ ఆర్సీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో... అతని భార్య రేణుక కూడా మైనరే అని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. అసలు... రేణుక, చెన్నకేశవుల పెళ్లి చెల్లదని అధికారులు చెబుతున్నారు. వారి పెళ్లి బాల్య వివాహం కిందకు వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో... రేణుకను ఆమెను తమ సంరక్షణలోకి తీసుకుంటామని, మేజర్‌ అయ్యేంతవరకు స్టేట్‌హోమ్‌లో ఉంచుతామని బాలల సంక్షేమ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ చెప్పారు.

ఆమె గర్భవతి కావడంతో ఆసుపత్రి నుంచి వైద్యసహాయం కూడా అందిస్తామని తెలిపారు. వారి వివాహం చట్టపరంగా గుర్తింపు ఉండదని, పుట్టబోయే బిడ్డకు హక్కులు వర్తిస్తాయని తెలిపారు. మేజర్‌ అయిన తర్వాత బాలిక ఇష్టానుసారం వెళ్లవచ్చని, పుట్టేబిడ్డ విషయంలో కూడా ఆమె అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని తెలిపారు.