హైదరాబాద్ శివారులో వందల ఎకరాల భూధాన్ భూముల కబ్జా వ్యవహారం బట్టబయలైంది. కోట్ల విలువైన ఈ భూముల అక్రమ విక్రయాలపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది... తాజాగా స్పీడ్ పెంచిన ఈడి ఇళ్లపై దాడులకు దిగింది. 

Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఇలా కోట్ల విలువచేసే వందల ఎకరాల భూధాన్ భూములను కొందరు కబ్జాచేసి దర్జాగా వెంచర్ చేసి అమ్ముకున్నారు. తాజాగా ఈ వ్యవహారం బైటపడింది... రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. తాజాగా హైదరాబాద్ లో సోదాలు చేపట్టారు. 

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, షర్పోన్ ఇళ్లలో ఈడి అధికారులు సోదాలు చేపట్టారు. ఈ భూధాన్ భూముల అక్రమాల వ్యవహారంలో ఐఎఎస్ అధికారి అమాయ్ కుమార్ ను కూడా ఇప్పటికే ఈడి విచారించింది. ఇతడు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు వేగవంతం చేసి ఇవాళ ఇళ్లలో దాడులు చేపట్టారు. 

హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో వంద ఎకరాల భూదాన్ భూమిని ఆక్రమించుకుని ప్లాట్లు చేసి అమ్మినట్లు ఈడి ఇప్పటికే గుర్తించింది. వందల ఎకరాలు భూమి, కోట్లాది రూపాయల ఆర్థిక వ్యవహారాకు సంబంధించింది కావడంతో స్వయంగా ఈడి దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం పాతబస్తీలో మూడుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.