హైదరాబాద్‌ పాతబస్తీలో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పర్యవేక్షించారు. గురువారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో సీవీ ఆనంద్ శాలిబండలో పర్యటించారు. 

హైదరాబాద్‌ పాతబస్తీలో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పర్యవేక్షించారు. గురువారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో సీవీ ఆనంద్ శాలిబండలో పర్యటించారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. మహమ్మద్ ప్రవక్తపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పాతబస్తీలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. సోమవారం రాత్రి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత చర్యలు చేపట్టారు. 

అయితే గత రాత్రి ఆందోళనకారులు రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీస్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. రాత్రంతా రోడ్డు మీదకు రాకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. 

ఇక, బుధవారం ఆర్పీఎఫ్‌ బలగాలు పాతబస్తీలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించాయి. పోలీసులు అప్రమత్తమైనప్పటికీ కొందరు నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. శాలిబండ, సైదాబాద్‌ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళన చేపట్టారు. మరోవైపు సౌత్‌‌ జోన్ డీసీపీ సాయిచైతన్యతో కలిసి అడిషనల్‌‌ సీపీ డీఎస్‌‌ చౌహాన్‌‌ పాతబస్తీలో పర్యటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెంట్రల్‌‌ ఫోర్సెస్‌‌ ను మోహరించారు. స్థానిక పోలీసులతో పెట్రోలింగ్‌‌ నిర్వహించారు. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని సౌత్‌‌ జోన్ డీసీపీ సాయి చైతన్య స్పష్టంచేశారు.