Asianet News TeluguAsianet News Telugu

రాజా సింగ్‌పై గతంలోనే రౌడీషీట్, 100కు పైగా క్రిమినల్‌ కేసులు.. పీడీ యాక్ట్ నమోదు చేయడంపై సీవీ ఆనంద్

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు సంబంధించి హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 

Hyderabad CP CV Anand says PD Act on mla rajasingh
Author
First Published Aug 25, 2022, 4:57 PM IST

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు సంబంధించి హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రాజాసింగ్‌పై గతంలోనే రౌడీషీట్ ఉందన్నారు. గత కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా చెప్పారు. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. మత ఘర్షణలు చోటుచేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయని చెప్పారు. 

ఈ నెల 22న రాజాసింగ్ రెచ్చగొట్టేలా ఓ యూట్యూబ్ చానల్‌‌లో ఓ వీడియో పోస్టు చేశారని సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియో పోస్టు చేశారని చెప్పారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు.  ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకన్నాయని చెప్పారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. 

ఇదిలా ఉంటే.. గురువారం రాజాసింగ్‌కు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రాజా సింగ్‌ను అరెస్ట్ చేయడానికి ముందు పీడీ యాక్ట్ నమోదుకు సంబంధించిన నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. రాజా సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. రాజా సింగ్ అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు.

ఇటీవల రాజాసింగ్ రిమాండ్‌‌ను నాంపల్లి  కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. రిమాండ్‌పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.  నాంప‌ల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్‌ను తిర‌స్క‌రించ‌డాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. . పోలీసుల రిమాండ్ పిటిష‌న్‌పై హైకోర్టు రేపు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Follow Us:
Download App:
  • android
  • ios