వెపన్స్ డిపాజిట్ చేయండి.. ఎన్నికల వేళ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో లైసెన్స్ వెపన్స్ కలిగిన వారు.. వెంటనే వాటిని డిపాజిట్ చేయాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 16లోపు పోలీసు స్టేషన్లలో వాటిని డిపాజిట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే వెపన్స్ డిపాజిట్ చేయని వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెపన్స్ డిపాజిట్ చేసినవారు.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత డిసెంబర్ 10న వాటిని తీసుకెళ్లచ్చని పేర్కొన్నారు. అయితే జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణంలో గార్డు డ్యూటీ విధులు నిర్వర్తించేవారికి, భద్రతా సిబ్బందికి ఇందులో నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక, హైదరాబాద్ జిల్లాలో 1587 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించినట్లుగా సీవీ ఆనంద్ సోమవారం తెలిపారు. నవంబర్ 30న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 32 కంపెనీల కేంద్ర బలగాల సహాయాన్ని కోరినట్టుగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా నగరంలో నిఘా కోసం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా.. వాణిజ్య పన్ను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీఏ, ఎక్సైజ్, నార్కోటిక్స్ అధికారులు రౌండ్-ది క్లాక్ పర్యవేక్షణను నిర్వహిస్తారని చెప్పారు.
మద్యం షాపుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు తరలించేవారు సంబంధిత పత్రాలను అందించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ డబ్బు దేనికి ఉపయోగించబడుతోందనే వివరాలను చూపించడం అవసరం ఉందని తెలిపారు. పరిమితికి మించి డబ్బు బదిలీ చేయబడిన ఖాతాలను పరిశీలిస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇక, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి.