హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్‌ గోడ కూలడంతో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్‌ గోడ కూలడంతో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహననగర్‌లో సునీల్‌ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా బేకరి నడుపుకుంటున్నాడు. మంగళవారం ఉదయం బేకరిలో ఉన్న సునీల్‌కు టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు అతని భార్య మేరీ, కూతురు శరోన్ దీత్య (Sharon Dhitya)‌తో కలిసి బయలుదేరింది. అయితే వాళ్లిద్దరు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. పక్కనే ఉన్న భవనంపై నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడ కూలి ఇటుకలు రోడ్డుపై పడ్డాయి. 

ఇటుకలు చిన్నారి Sharon Dhitya తలపై పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చిన్నారి మృతిచెందింది. తన కళ్ల ఎదుటే చిన్నారి మృతిచెందడంతో కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇటుకలు మీద పడి మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

నిర్మాణంలో ఉన్న గోడ విషయంలో యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.