రాష్ట్రంలో ఇంత జోరు వానల మధ్యకూడా కాక పుట్టిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది నిస్సంకోచంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికే. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. తెరాస నాయకత్వం మండలానికో మంత్రిని ఇంచార్జిగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఏమో సహజంగానే నల్గొండ జిల్లాపై తమకున్న పట్టును ఉపయోగించుకొని గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది. 

తెలంగాణ రాజకీయాల్లో తాజా శక్తి బీజేపీ సైతం దూకుడును ప్రదర్శిస్తోంది. పెరిక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడంతో,అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ను బరిలోకి దింపింది. యువతను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సిపిఎం తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు అభ్యర్థిని బరిలోకి దింపింది. 

ఇదంతా బాగానే ఉంది. జనాల మనసులో ఉద్భవించే మిలియన్ డాలర్ ప్రశ్న ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా టీడీపీ పోటీలో నిలవడమే. అందునా చంద్రబాబు నాయుడు పార్లమెంటు ఎన్నికల మాదిరి తెలంగాణ నేతల ఇష్టానికి వదిలేయకుండా, తానే దగ్గరుండి మరీ ఈ ఉప ఎన్నికపై ఆసక్తి చూపడం. 

ఈ విషయం అర్థం కావాలంటే 2019 ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాలను మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయారు. దేశంలో చంద్రబాబు కట్టిన ఫ్రంట్ ఊసే లేకుండా పోయింది. 

2019 ఎన్నికల ముందు బీజేపీని కనీసం రోజుకోసారైనా విమర్శించే చంద్రబాబు ఎన్నికలైపోయిన తరువాత బీజేపీని పల్లెత్తుమాటైనా అనట్లేదు. చంద్రబాబుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మరీ మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా వంటివారు ప్రచారం చేసారు. ఇప్పుడు ఫరూఖ్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు చంద్రబాబు సంఘీభావం కూడా తెలుపలేదు. కనీసం ఒక పత్రికా ప్రకటనను కూడా విడుదల చేయలేదు. 

మమతా బెనర్జీ బెంగాల్ లో ఎన్నార్సి అవసరంలేదని రోజూ మాట్లాడుతున్నా, ఒక్కసారికూడా ఆమెకు మద్దతు తెలుపలేదు. చంద్రబాబు కట్టిన జాతీయ ఫ్రంట్ నాయకుల నుంచి పూర్తిగా దూరం పాటిస్తున్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి మాంద్యంలో ఉందని విపక్షాలన్నీ గొంతు చించుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఈ విషయమై ఏమీ మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. 

2019  ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషిచేశారు చంద్రబాబు. ఒక రకంగా ఆ కూటమి డ్రైవర్ సీట్ లో కూర్చొని అన్నీ తానై నడిపించాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆ కూటమిలోని పార్టీలతోని, ఆ పార్టీల నాయకులతోని అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

ఎన్నికలైపోయిన తరువాత టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం చంద్రబాబు వ్యూహంలో భాగమే అనే మాటలు బలంగా వినిపించాయి. ఈ మాటలకు బలం చేకూరుస్తూ మరికొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పార్టీ మారిన నాయకులంతా చంద్రబాబుకు చెప్పే మారాము అనడం, పోలవరం పనులపైన, పీపీఏల రద్దుపైనా కేంద్రం టీడీపీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. 

ఇలాంటి పరిణామాల వల్ల మరిన్ని ఊహాగానాలు బయల్దేరాయి. చంద్రబాబు బీజేపీతోని కలవడానికి ఎన్నికలైపోగానే సుముఖత చూపెట్టారని, కానీ ఎన్నికలైపోగానే కలిస్తే ఇరు పార్టీలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని బీజేపీ వారించినట్టు సమాచారం. 

సో,ఇప్పుడు టీడీపీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడం కూడా, బీజేపీకి మరింత దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే అనిపిస్తుంది. ఇలా ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడం ద్వారా, కాంగ్రెస్ తోని తెగదెంపులు పూర్తి స్థాయిలో చేసుకున్నామని చూపెట్టవచ్చు.

 కాంగ్రెస్ కు హుజూర్ నగర్ చాలా ప్రతిష్టాత్మకమైన సీట్. ఈ సీటులోనే కాంగ్రెస్ పై బరిలోకి దిగడం ద్వారా చాల స్పష్టంగా చంద్ర బాబు తన మెసేజ్ ను బీజేపీ అధినాయకత్వానికి పాస్ చేయాలనుకున్నారు. మాకు కాంగ్రెస్ తో ఏ విధమైన సంబంధాలు లేవు. మేము సంబంధాలను కొనసాగించదలుచుకోలేదు కూడా అని ఒక బలమైన సందేశాన్ని ఈ పోటీ ద్వారా పంపాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... పోటీకి 85ఏళ్ల బామ్మ సై

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పోటాపోటీ: ఉనికి కోసం బీజేపీ, టీడీపీ

ఉత్తమ్ మరో సవాల్: అప్పుడు గెడ్డం తీయనని, ఇప్పుడు ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ ఛాలెంజ్

హుజూర్ నగర్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం. కాబట్టి అక్కడ ఆంధ్రా ప్రాంతం వారు సంఖ్యా పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీగా టీడీపీని తెలంగాణ ప్రజలు భావిస్తారు. అందువల్ల అక్కడేదో టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గణనీయమైన ఓట్లు వస్తాయనుకోలేము. 

టీడీపీ వర్గాలు చెబుతున్నట్టు అస్తిత్వం కోసం పోరాడడమే అయితే, మొన్నటి గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఏదో తూతూ మంత్రంగా కాకుండా గట్టిగానే పోటీచేసేవారు. మరి ఇప్పుడు ఇక్కడ హుజూర్ నగర్ లో పార్టీని రక్షించుకోవడానికే అని పైకి చెబుతున్నా, లోలోన మాత్రం బీజేపీకి మరింత చేరువవ్వడానికే. 

సరే ఇదంతా బాగానే ఉంది మరి అంతలా బీజేపీకి దగ్గరవ్వాలనే భావిస్తే, బీజేపీకే నేరుగా మద్దతు ప్రకటించొచ్చుగా అనే అనుమానం కలుగక మానదు. కానీ ఆలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు దెబ్బతిని జగన్ మరింత బలం పుంజుకునే ఆస్కారం ఉంది. 

సో, చంద్ర బాబు హుజూర్ నగర్ రాజకీయం చంద్రబాబుకు లాభిస్తుందో లేదో చూడాలి.