హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో గెలవాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులమీద పై ఎత్తులు వేస్తున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో  రాజకీయాలతో సంబంధం లేని కొందరు కూడా బరిలోకి దిగారు. తన భూమికి రెవెన్యూ అధికారులు పట్టా ఇవ్వడం లేదని, అందుకు నిరసనగా తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల బామ్మ ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. 

‘మాకు 100 ఎకరాల భూమి ఉంది. పట్టా కోసం అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది.  అందుకే పోటీ చేస్తున్నా..’ అని నర్సమ్మ తెలిపింది. ఆమెతోపాటు మట్టంపల్లి మండలం గుర్రంపోడుకు చెందిన పలువురు గిరిజనులు బరిలోకి దిగా నామినేషన్లు వేశారు. అధికారులు తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. కాంగ్రెస్ తరఫున పద్మావతి, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి, బీజేపీ అభ్యర్థి కోట రామారావు పోటీ పడుతున్నారు.