సూర్యాపేట: అఖండ మెజారిటీతో గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  

హుజూర్ నగర్ అభివృద్ధి కోసం జరిగిన ఎన్నిక అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ గెలవాలని ప్రతి ఒక్కరూ భావించారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. 

తనను కేసీఆర్ కు దగ్గర చేసేందుకే ప్రజలు గెలిపించారని శానంపూడి సైదిరెడ్డి స్పష్టం చేశారు. 2014 నుంచి నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అందువల్లే తనకు పట్టంకట్టారని తెలిపారు. 


తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహకారం తో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం పొందేలా అందరి మన్ననలు పొందేలా భవిష్యత్ లో పనిచేస్తానని చెప్పుకొచ్చారు. 

ఈవీఎంలను మేనేజ్ చేయడం వల్లే గెలుపొందారన్న కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి వ్యాఖ్యలపై సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో తాను ఓడిపోయానని అయితే తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. హుందాతనంతో ప్రజా తీర్పును గౌరవించినట్లు చెప్పుకొచ్చారు. 

గత ఎన్నికల్లో తాను ట్రక్కు గుర్తు వల్ల ఓడిపోయానని అది అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. కానీ తాను ఎలాంటి అబ్జక్షన్ పెట్టలేదన్నారు. తాను ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానే తప్ప పదవే పరమావధిగా రాజకీయాల్లోకి రాలేదన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నేతలకు అవాక్కులు చెవాక్కులు పేలడం తప్ప ఇంకేమీ కనిపించడం లేదన్నారు. వారు కాంగ్రెస్ గుర్తులను నమ్ముకున్నారే తప్ప ప్రజలను నమ్మలేదన్నారు. ఇకపోతే టీడీపీ, బీజేపీలను కూడా ప్రజల ఆదరించలేదన్నారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధే తన ధ్యేయమని చెప్పుకొచ్చారు సైదిరెడ్డి. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయని వారు కూడా సైదిరెడ్డికి ఓటు వేయాలని భావించేలా తాను పనిచేస్తానని ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు: టీఆర్ఎస్ పై ఉత్తమ్ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

సైదిరెడ్డి విజయం ప్రభుత్వానికి టానిక్: ఎల్లుండి హుజూర్ నగర్ కు కేసీఆర్