హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం పనితననాకి నిదర్శనమని చెప్పుకొచ్చారు. 

హుజూర్ నగర్ ఉపఎన్నిక అనేది పనిచేస్తున్న ప్రభుత్వానికి టానిక్ లాంటిది అని చెప్పుకొచ్చారు. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ఉంటుందని తెలిపారు. ఎల్లుండి హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. 

ఈఎన్నికల్లో భారీ విజయాన్ని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు పంథా మార్చుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో తాను పదేపదే చెప్పుకొచ్చానని విమర్శలు చేయవచ్చునని ప్రజలను గందరగోళం చేసేలా విమర్శలు చేయవద్దని సూచించారు. 

ఇకపోతే హుజూర్ నగర్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలు గుడ్డెద్దు చేలో పడిన విధంగా విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు. ఇష్టం వచ్చినట్లు అర్థంపర్థంలేని విమర్శలు చేస్తే ప్రజలు సహించరని తగిన గుణపాఠం చెప్తారన్నందుకు హుజూర్ నగర్ ఉపఎన్నికే నిదర్శనమన్నారు. 

రాజకీయాల్లో ప్రతిపక్షం అవసరం అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీ ఉంటేనే ప్రజాస్వామ్యం మరింత బాగుంటుందని తెలిపారు. అయితే వివాదాలు, విమర్శలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయాలని కేసీఆర్ హెచ్చరించారు.