హుజూర్‌నగర్:  హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోలింగ్ సాఫీగా సాగుతోంది.  ఉదయం పది గంటల వరకు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో  2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల కోసం మొత్తం 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1708 ఈవీఎం యూనిట్లను ఏర్పాటు చేశారు.

 ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల వరకు 14శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

 నియోజకవర్గంలో మొత్తం 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి.. ఆయా చోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కాగా.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఈ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి, టీడీపీ అభ్యర్ధిగా చావా కిరణ్మయి బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్ధిగా కోట రామారావు బరిలో నిలిచారు. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి  విజయం సాధించాడు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

2009 నుండి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్థానం నుండి విజయం సాధిస్తున్నారు. ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.  దీంతో ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది.

హుజూర్ నగర్ ఉపఎన్నిక: ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి

టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు ఏ పార్టీ ఓట్లు చీల్చుతాయనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పోటీ చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్ధికి టీడీపీ మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ పోటీ చేసింది.టీడీపీ అభ్యర్ధికి ఈ స్థానం నుండి సుమారు 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 

Huzurnagar bypoll:హుజూర్‌నగర్‌లో ప్రారంభమైన పోలింగ్

రెండు ఎన్నికల్లో బీజేపీకి 1500 ఓట్లు దాటలేదు. ఈ దఫా మాత్రం గణనీయమైన ఓట్లను సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ పెరిక సామాజిక వర్గానికి చెందిన కోట రామారావును బరిలోకి దింపింది. ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందోననేది ఈ నెల 24న తేలనుంది.