సూర్యాపేట: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చింతలపాలెం మండలం కృష్ణాపురంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి వెళ్లగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఉత్తమ్ పద్మావతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మళ్లీ హుజూర్ నగర్ ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. 

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారం రోజులకు పైగా అక్కడే తిష్టవేశారు. 

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ సైతం హుజూర్ నగర్ ను తమ ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తోంది. హుజూర్ నగర్ పై కన్నేసిన గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలను అక్కడకు పంపారు. టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఉప ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే నెలకొంది. ఇకపోతే ఉదయం నుంచి హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలు పోలిగ్ బూత్ ల దగ్గర బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

 హుజూర్ నగర్ ఉపఎన్నిక: ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి