Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్‌ ఫలితాలు కేసీఆర్ నెక్ట్స్ ఏం చేయనున్నారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..?

హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కు విజయంతో KCRకు గట్టి షాక్ తగిలిందనే అనే చెప్పాలి. చాలా మంది ఈ విజయాన్ని కేసీఆర్‌పై ఈటల విజయంగా భావిస్తున్నారు. ఈటల విజయంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు  అంచనా వేస్తున్నారు. 

huzurabad election results What Kcr Do Next Here is Experts opinion
Author
Hyderabad, First Published Nov 2, 2021, 7:59 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. 24  వేల ఓట్ల మెజారిటీ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై జయకేతనం ఎగరేశారు. అయితే ఈ ఎన్నికలు మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాకుండా.. కేసీఆర్ వర్సెస్ ఈటలగానే (KCR Vs Etela) జరిగాయని చెప్పాలి. మే 2వ తేదీన భూ అక్రమణ ఆరోపణాలు రావడంతో కేసీఆర్ ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలోనే ఈటల పార్టీకి, ఎమ్మెల్యే పదికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి.. టీఆర్‌ఎస్‌తో తలపడ్డాడు. అయితే కేసీఆర్‌ను ఎదుర్కొవడం అంత సులవైన పని కాదని ఈటలకు కూడా తెలుసు. దీంతో ఈటల కూడా వ్యుహాత్మకంగా వ్యవహరించాడు. మంత్రులు నెలల తరబడి అక్కడే మకాం వేసి.. టీఆర్‌ఎస్ విజయం కోసం ప్రయత్నించినా ఈటల వారి వ్యుహాలను జయించి విజయం సాధించాడు.

అయితే ఈటల విజయంతో KCRకు గట్టి షాక్ తగిలిందనే అనే చెప్పాలి. చాలా మంది ఈ విజయాన్ని కేసీఆర్‌పై ఈటల విజయంగా భావిస్తున్నారు. ఈటల విజయంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దళిత బంధు వంటి పథకాలు తీసుకొచ్చిన.. ప్రజలు కేసీఆర్‌ పూర్తిగా విశ్వసించలేదని ఈటల వైపే మొగ్గుచూపారని, కేసీఆర్‌ పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి లేదని వారి వాదన. 

Also raed: హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు పార్టీ చేసిందిదే..? 3 వేల ఓట్లకే పరిమితం..

మరోవైపు ఈటల విజయం తర్వాత.. టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తులు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. అటువంటి వారికి కాంగ్రెస్ కంటే బీజేపీ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా దక్షిణాదిన కర్ణాటక తర్వాత.. తెలంగాణపై ఫోకస్ పెడుతుంది. దీంతో ఆ పార్టీ కూడా అసంతృప్తితో ఉన్న నేతలకు పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరపవచ్చు. మరోవైపు బీజేపీలో చేరితే కేసీఆర్ ఏం చేయలేడనే ఓ ప్రచారం కూడా ఉంది. బీజేపీ నుంచి మద్దతు లభిస్తుందని ఈటల రాజేందర్ విషయంలో  స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా బలమైన నేతగా ఉన్న కేసీఆర్‌ను ఎదురించడం అంతా పెద్ద విషమేమి కాదని ఈటల నిరూపించారని వారు అంటున్నారు.

Also read: Huzurabad Bypoll Result: నిలబడ్డాడు.. కలబడ్డాడు.. ఈటల గెలుపు వెనుక..!

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కొద్దిగా దూకుడును తగ్గించుకోవాల్సి ఉంటుందని.. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌లు తీర్చడం, జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా నిరుద్యోగుల నుంచి మద్దతు కూటగట్టడం చేయవచ్చని అంటున్నారు. అంతేకాకుండా పార్టీ నేతలతో వ్యవహరించే తీరు కూడా మారుతుందని అంటున్నారు. పార్టీలో అసంతృప్తులు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని అభిప్రాయపడుతున్నారు.

ముందస్తు ఎన్నికలు..?
మరోవైపు ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువు 2023 నవంబర్ వరకు ఉంది. ఈ సారి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అవుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అగ్రనేత అమిత్ షా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశాడంటే వారి ఫోకస్ తెలంగాణపై గట్టిగానే ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కూడా అమిత్ షా, బీజేపీ కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ గట్టిగా ఫోకస్ చేయడం, మరోవైపు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు యత్నించడంతో కేసీఆర్ వారిని ఎదుర్కొవడానికి వ్యుహా రచన చేయాల్సి ఉంటుంది.

Also Read: గెల్లుకు సొంతూర్లోనే కాదు.. అత్తగారి ఊరిలో‌నూ షాక్.. అక్కడ ఈటల ఆధిక్యం ఎంతంటే..?

ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రత్యర్థులకు చాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలు(Snap election) వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఫోకస్ మొత్తం తెలంగాణ పడకుండా ఉండేలా.. ఉత్తారాది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న సమయంలో గానీ, ముఖ్యంగా గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో గానీ తెలంగాణ‌లో ఎన్నికలు జరిగేలా వ్యుహాలు రచించే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇలా చేయడం ద్వారా బీజేపీ అగ్రనేతల మొత్తం ఫోకస్ తెలంగాణపై లేకుండా చేసేందుకు వీలు కలుగుతుంది. 

గుజరాత్‌లో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పుడే ఎన్నికలు జరగాలి అనుకుంటే కేసీఆర్ ఏడాదికి ముందే Snap electionకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే మరికొందరు మాత్రం కేసీఆర్ అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చని అంటున్నారు. మరోవైపు కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అనకుంటున్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆరే అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయం కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటుందంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios