Asianet News TeluguAsianet News Telugu

పాలేరు స్థానంలో ఉత్కంఠ రాజకీయం.. హుజురాబాద్ బైపోల్ హీట్ రిపీట్?

పాలేరు స్థానం సీటును వదిలిపెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధపడటం లేదు. అలాగే, సీపీఎం కచ్చితంగా పోటీ చేయాలనే పట్టుబడుతున్నది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నది. ఈ తరుణంలో కేసీఆర్ ఇక్కడ సంచలన హామీ ప్రకటించారు. హుజురాబాద్‌లో దళితులందరికీ అందించినట్టుగానే ఇక్కడా బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్‌ను గెలిపిస్తే దళితులందరికీ దళిత బంధు అందిస్తామని, ఇది ‘నా హామీ’ అంటూ కేసీఆర్ ప్రకటించారు.
 

huzurabad bypoll heat may repeat in paleru constituency as kcr announces dalitha bandhu to all dalits kms
Author
First Published Oct 27, 2023, 6:53 PM IST | Last Updated Oct 27, 2023, 6:53 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు సీటు చుట్టూ ఉత్కంఠ రాజకీయం జరుగుతున్నది. ఈ సీటుపై అటు కాంగ్రెస్, ఇటు సీపీఎం మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. పాలేరు సీటును వదిలిపెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుబడుతున్నది. ఈ తరుణంలో బీఆర్ఎస్ కూడా సంచలన హామీ ప్రకటించింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్‌ను గెలిపిస్తే దళితులందరికీ దళితు బంధు అందించే పూచీ తనదని సీఎం కేసీఆర ప్రకటించారు. దీంతో పాలేరు సీటుపై ఆసక్తి నెలకొంది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. కాగా, ఇదే సీటు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఈ సీటు కచ్చితంగా సీపీఎంకు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నది. లేదంటే.. సీపీఎం పొత్తు కూడా రద్దయ్యే ముప్పు ఉందనే వార్తలు రావడం ఈ సీటుపై ఉభయ పార్టీల ప్రాధాన్యతను వెల్లడిస్తున్నది.

పాలేరు సీటును పట్టుబట్టడంతో సీపీఎంతో పొత్తు అవసరమా? అనే ఆలోచన కూడా కాంగ్రెస్ వర్గాల్లో వస్తున్నది. ఇక్కడ పాలేరు సీటు కచ్చితంగా పొంగులేటికి ఇవ్వాలనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా బరిలో ఉన్నది.

Also Read: ‘సీఎం అభ్యర్థి’ చర్చ లేపిన అమిత్ షా.. ఏ పార్టీలు ఏమన్నాయి?

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినట్టుగా దళితులందరికీ దళిత బంధు ఇచ్చే హామీ తనదని సీఎం కేసీఆర్ స్వయంగా పాలేరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి చెప్పడం గమనార్హం. కేసీఆర్‌కు అతి సన్నిహితంగా ఉండే ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ బైపోల్ అనివార్యమైనప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలంతా ప్రచారం చేశారు. హుజురాబాద్‌లో కచ్చితంగా గెలువాలనే ఉద్దేశంతో కొత్తగా ప్రకటించిన దళిత బంధును అక్కడి దళితులందరికీ అందించే పని చేశారు. తాజాగా, ఇదే హామీ పాలేరు నియోజకవర్గంలోనూ కేసీఆర్ ప్రకటించడం కొత్త చర్చను లేపింది. ఈ సీటు నుంచి దాదాపుగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్న తరుణంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. దీంతో హుజురాబాద్‌లో జరిగిన హోరాహోరీగా పోటీనే, ఆ హీట్ ఇప్పుడు  మళ్లీ పాలేరులో రిపీట్ కానుందా? అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios