Asianet News TeluguAsianet News Telugu

‘సీఎం అభ్యర్థి’ చర్చ లేపిన అమిత్ షా.. ఏ పార్టీలు ఏమన్నాయి?

బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను సీఎంగా చేస్తామని అగ్రనేత హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దీంతో దళిత ముఖ్యమంత్రి, గిరిజన ముఖ్యమంత్రి చర్చలతోపాటు.. ఏ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయనే చర్చ కూడా మొదలైంది.
 

amit shah declares bc cm if bjp come to power, what congress, brs thinking kms
Author
First Published Oct 27, 2023, 5:36 PM IST

హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సూర్యపేటలో నిర్వహించిన జనగర్జన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పార్టీ అని విమర్శిస్తూ సీఎం సీటుపై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వారసత్వ పార్టీలు అని అన్నారు. కేసీఆర్ తన వారుసుడు కేటీఆర్‌ను సీఎం చేయాలని, సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని పీఎం చేయాలనే ధ్యాసలోనే ఉంటారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకున్నా.. గెలిస్తే మాత్రం బీసీ నేతను సీఎం చేస్తామని పేర్కొనడం గమనార్హం. బీజేపీలో కీలక బీసీ నేతలుగా ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్, కే లక్ష్మణ్‌లు ఉన్నారు.

దీంతో సీఎం సీటుపై చర్చ మొదలవుతున్నది. బీజేపీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. ఎన్నికల్లోనూ బీసీలకు ప్రాధాన్యతనే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నది. తాజాగా, అమిత్ షా బీసీ నేతనే సీఎంగా చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని నిలదీశారు. దీంతో ఇతర పార్టీల ఆలోచనలేమిటీ? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Also Read: ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నేత.. తెలంగాణలో బీజేపీ వ్యూహం?

బీఆర్ఎస్‌లో..

కేసీఆర్ సీఎంగా కేటీఆర్‌ను చేయాలని భావిస్తున్నారని బీజేపీ ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. ప్రధాని మోడీ సహా పలువురు నేతలు చాలా సార్లు ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ తిప్పికొట్టింది. వాస్తవానికి బీఆర్ఎస్ నేతలు కూడా చాలా సార్లు కేటీఆర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ, ఎన్నికలు సమీపించగానే అలాంటిదేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కేసీఆర్, కేటీఆర్ స్వయంగా బీజేపీ ఆరోపణలను ఖండించారు. పార్టీలో తన కంటే గొప్ప నేతలు ఉన్నారని కేసీఆర్ పేర్కొనగా.. కేటీఆర్ కూడా తన కంటే ఉద్ధండ నేతలు పార్టీలో ఉన్నారని అన్నారు. తనకూ సీఎం కుర్చీపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. మూడో సారి బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ సీఎంగా దక్షిణాదిలో సీఎం చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైతే సీఎం క్యాండిడేట్‌గా బీఆర్ఎస్ నుంచి కేసీఆర్‌ అనేది సుస్పష్టం.

కాంగ్రెస్‌లో..

ఈ రెండు పార్టీల్లో సీఎం అభ్యర్థిపై ఓ క్లారిటీ ఉన్నది. కానీ, కాంగ్రెస్‌లో ఇంత స్పష్టత లేదనేది అందరికీ తెలిసిందే. సీఎం కుర్చీ కోసం చాలా మంది రాష్ట్ర నేతలు ఆశపడుతున్నట్టు చాలా సందర్భాల్లో బయటపడింది. కాంగ్రెస్‌లో గిరిజన నేతను సీఎంగా చేయాలని సీతక్కను తెర మీదికి తెచ్చారు. దళిత సీఎంగా భట్టి విక్రమార్క కోసం వాదనలూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తాజాగా జగ్గారెడ్డి కూడా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్నారని మీడియాలో ప్రచారంలో ఉన్నది. అయితే.. ఈ నేతలే సీఎం అభ్యర్థిపైనా కొన్ని స్పష్టీకరణలు ఇచ్చారు. మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత సీఎల్పీ సీఎంను నిర్ణయిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేల ఓట్లతో కాంగ్రెస్ అధిష్టానం సీఎంను నిర్ణయిస్తుందనీ వీరే సమాధానాలూ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios