మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య తన మాట వినలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పశ్చిమ గోదావరి జిల్లా కానూరుకు చెందిన సత్యనారాయణ ఉపాధి నిమిత్తం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వలసవచ్చాడు.  జూబ్లీహిల్స్ ప్రాంతంలో భార్య దేవకి, కొడుకు ధనేశ్వర్, కూతురు మల్లీశ్వరితో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇక్కడికి వచ్చాక మద్యానికి బానిసైన సత్యనారాయణ కుటుంబ పోషణను గాలికొదిలేశాడు. దీంతో అతడి భార్య, కొడుకు కలిసి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

అయితే రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చే సత్యనారాయణ భార్యను వేధించేవాడు. ఇలాగే గురువారం ఉదయం కూడా ఫుల్లుగా మద్యం తాగా వచ్చిన ఆయన భార్యకు చికెన్ వండమని చెప్పాడు. అయితే అప్పటికే కూలీ పనులకు వెళ్లడానికి సిద్దమైన దేవకి సాయంత్రం వచ్చాక వండిపెడతానని చెప్పి కొడుకుతో కలిసి బైటికి వెళ్లిపోయింది. కూతురు కూడా స్కూల్ కి వెళ్లిపోయింది. 

భార్య తాను చెప్పిన మాట వినలేదని మనస్తాపానికి గురైన సత్యనారాయణ మద్యం మత్తులో దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.  ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భార్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.