తాగిన మత్తులో ఓ వ్యక్తి  కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చిప్పలపల్లి గ్రామానికి చెందిన కాసోజు జంగయ్యచారి(45), కృష్ణవేణి(40) దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా.. నాలుగో కుమార్తె వారితోనే ఉంటోంది. ఆదివారం వారి చిన్న కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లింది.

Also Read కామారెడ్డిలో దారుణం: భార్యను కొట్టి వివస్త్రను చేసి గెంటేసిన భర్త...

అదే సమయంలో పీకలదాకా తాగి ఇంటికి వచ్చిన జంగయ్యచారితో భార్య కృష్ణవేణి గొడవ పడింది. ఈ క్రమంలో...కోపంతో ఊగిపోయిన జంగయ్య... భార్యపై దాడికి దిగాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాననే స్పృహ కూడా లేకుండా.. గునపంతో భార్యను పొడిచి హత్య చేశాడు.

ఆ తర్వాత భయంతో తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.