నిర్మల్ : గ్రామాన్ని ముంచెత్తిన వరదనీరు... ప్రాణభయంతో కొండపైకి పరుగుతీసిన ప్రజలు (వీడియో)
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి.

నిర్మల్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఆస్తినష్టాన్నే కాదు ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఉదృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో కొట్టుకుపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తూ గ్రామాలు గ్రామాలనే ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని వరదనీరు ముంచెత్తగా తాజాగా నిర్మల్ జిల్లాలోనూ ఓ గ్రామం పరిస్థితి ఇలాగే మారింది. వరదనీటి ఉదృతికి చెరువుకట్ట తెగిపోయి గ్రామాన్ని చుట్టుముట్టడంతో ప్రజలంతా ప్రాణభయంతో ఓ కొండపైకి పరుగుతీసారు. అంతకంతకు వరదనీరు పెరుగుతుండటంతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. ఇలా బైంసా జిల్లా సిరాల గ్రామ సమీపంలోని చెరువులోకి భారీగా వరదనీరు చేరింది. ఇలా పూర్తిగా నిండిపోయినా వరదనీరు వచ్చి చేరుతుండటంతో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వరదనీరంతా గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్తులు ప్రాణభయంతో ఓ గుట్టపైకి చేరుకున్నారు. దాదాపు 200 మంది ఎత్తైన ప్రాంతంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వర్షంలో తడిసి ముద్దవుతూ దిక్కుతోచని స్థితిలో గుట్టపైనే వున్నారు.
గ్రామస్తుల నుండి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గుట్టపైకి చేరుకుని గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. వరదనీరు అంతకంతకు పెరుగుతూ సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగిస్తోంది.
వీడియో
ఇదిలావుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సానికి ఓ గ్రామమే మునిగిపోయింది. మొరంచపల్లి గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో వెయ్యిమందికి పైగా గ్రామస్తులు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. గ్రామస్తులంతా ఇళ్లపైన, ఎత్తైన ప్రాంతాల్లో, చెట్లపైన తలదాచుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో ఒకసారిగా మేల్కొన్న ప్రజలు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ఇళ్లలోకి చేరిన వరదనీటిలో కొట్టుకుపోకుండా ఇళ్లమీదికి ఎక్కి తమని తాము కాపాడుకున్నారు.
చివరకు ఆర్మీ హెలికాప్టర్లు మోరంచపల్లికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బోట్ల సాయంతో గ్రామస్తులను కాపాడారు. అయితే వరదనీటిలో కొందరు కొట్టుకుపోయి మిగతావారి ప్రాణాలు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.