Gold: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Rajiv Gandhi International Airport: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి వారి లగేజీని స్కాన్ చేయగా ఆ ప్రయాణికుడి బ్యాగులో 610 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.32.8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరో ప్రయాణికుడి వద్ద 483 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ..
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నాలుగు నగల దుకాణాల్లో 300 కిలోల అక్రమ బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న సోదాల్లో విజయవాడ, తిరుపతి ఐటీ శాఖ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందగా, ఈ పట్టణాన్ని 'రెండవ బొంబాయి, బంగారు పట్టణం' అని కూడా పిలుస్తుంటారు. పట్టణంలోని కొందరు నగల వ్యాపారులు ఇన్ వాయిస్ లు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సోదాల్లో గురించిన బంగారం వివరాలు సంబంధిత రికార్డుల్లో లేదని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని సూట్ కేసులు, కార్టన్లలో అధికారులు భారీ భద్రత నడుమ తిరుపతికి తరలించారు. తగిన పత్రాలు లేకుండా నగల వ్యాపారులు గుజరాత్, ముంబయి, కోల్ కతా నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. పట్టణంలోని కొందరు ప్రముఖ నగల వ్యాపారులు బ్లాక్ బిజినెస్ కు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో వెయ్యికి పైగా నగల దుకాణాలు ఉన్నాయి. కొన్ని ప్రముఖ దుకాణాల్లో ఐటీ సోదాలతో మార్కెట్లో భయాందోళనలు సృష్టించింది. పలు నగల వ్యాపారులు షట్టర్లు మూసివేశారు. దీంతో ప్రస్తుత పండుగల సీజన్లో ఆభరణాల అమ్మకాలపై ప్రభావం పడిందని ఐఏఎన్ఎస్ నివేదించింది.