హైదరాబాద్‌ నార్సింగిలో సినీ ఫక్కీలో ఛేజ్ చేసి నగదును తరలిస్తున్న వారిని పట్టుకున్నారు పోలీసులు. ఈ నగదును కోమటిరెడ్డి సుమంత్, కోమటిరెడ్డి సూర్యపవన్ కోసం తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌ నార్సింగిలో శనివారం భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. రోటరి దగ్గర రూ. కోటి సీజ్ చేశారు. కోకాపేట్ - నార్సింగ్ మీదుగా వెళ్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. అయితే పోలీసులను చూసి కార్ల వేగం పెంచిన డ్రైవర్లు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్లను సినీ ఫక్కీలో ఛేజ్ చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్లను తనిఖీ చేయగా బ్యాగుల్లో కోటి నగదు దొరికింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. నలుగురు పరారయ్యారు. ఈ నగదును కోమటిరెడ్డి సుమంత్, కోమటిరెడ్డి సూర్యపవన్ కోసం తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో వున్నట్లుగా తెలుస్తోంది. మణికొండలో ఓ విల్లా నుంచి డబ్బులను మునుగోడుకు తరలించే యత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

అంతకుముందు శుక్రవారం కూడా హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. ఈ మొత్తం రూ.కోటిపైనే వుంటుందని సమాచారం. శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు.. ఈ క్రమంలో జుమ్మేరాత్ బజార్ వద్ద నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద భారీగా డబ్బు వెలుగుచూసింది. సొమ్ముకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారి నుంచి కారు, నగదును స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు పోలీసులు. నిందితులను కమలేశ్, అశోక్ కుమార్ , రతన్ సింగ్, రాహుల్ అగర్వాల్‌గా గుర్తించారు. వీరంతా దొడ్డిదారిలో సంపాదించేందుకు హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరి కోసం ఈ డబ్బును తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎవరికైనా అందించేందుకు ఈ సొమ్మును తరలిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ALso Read:హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా..?

ఇకపోతే.. ఈ నెల 12న కూడా పెట్టుబడుల పేరుతో హవాలా రాకెట్ ను నడిపిన 10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. తైవాన్ కు చెందిన చున్యూ, చైనాకు చెందిన జాక్ ఈ ముఠాలో కీలక పాత్రధారులని సీపీ చెప్పారు. ఈ కేసులో పుణెకు చెందిన వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేస్తే చైనాకి చెందిన జాక్ హస్తం బయటపడిందని ఆనంద్ తెలిపారు. ఈ మోసాన్ని ఈడీ లాంటి సంస్థలు కూడా గుర్తించలేవన్నారు. ఈ మోసంపై ఈడీ, డీఆర్ఐ అధికారులను దర్యాప్తు చేయాలని కోరుతామని సీవీ ఆనంద్ చెప్పారు.