Medaram Jathara: మేడారం జాతరలో ఎన్ని హుండీలు నిండాయి? అవి ఎవరికి చెందుతాయి?
మేడారం జాతరలో 512 హుండీలు పూర్తిగా నిండుకున్నాయి. వాటిని హన్మకొండుకు తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. తిరుగువారం జాతరనాటికి మరో 25 హుండీలు నిండే అవకాశాలు ఉన్నాయి. ఈ హుండీ ఆదాయం 13 మంది పూజారులకు, దేవాదాయ శాఖకు దక్కుతుంది.
మేడారం వనదేవతల జాతర ముగిసింది. ఈ సారి సమ్మక్క సారక్క జాతర గతంలో కంటే ఘనంగా జరిగింది. భక్తులు రికార్డు స్థాయిలో మేడారానికి వెళ్లారు. నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగింది. సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు సమ్మక్క, సారక్కలను మేడారంలో దర్శించుకున్నారు. మొక్కులతోపాటు కానుకలు కూడా చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారంలో ఎన్ని హుండీలు పెట్టారు? అందులో ఎన్ని నిండాయి? నిండిన ఆ సొమ్ము ఎవరికి చెందుతుంది? అనే ఆసక్తి కూడా నెలకొంది. ఆ వివరాలు చూద్దాం.
మేడారం జాతర ముగిసేనాటికి మొత్తం 512 హుండీలు నిండుకున్నాయి. ఆ హుండీలను కట్టుదిట్టమైన భద్రత నడుమ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపం స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచారు. ఈ నెల 29వ తేదీ నుంచి హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో, మేడారం పూజారుల సమక్షంలో ఈ ప్రక్రియ సాగుతుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
చివరిసారిగా 2022లో సమ్మక్క జాతర జరిగినప్పుడు మేడారంలో 497 హుండీలు ఏర్పాటు చేశారు. ఆ హుండీల ద్వారా రూ. 11.44 కోట్ల రూపాయాల ఆదాయం వచ్చింది. 631 గ్రాముల బంగారం, 48 కిలోల వెండి కానుకలు వచ్చాయి. కానీ, ఈ సారి అంతకు మించి అనేలా పరిస్థితులు ఉన్నాయి.
Also Read : Ramdev Baba: ఎంఐఎం.. బీజేపీకి బీ టీమ్? బాబా రాందేవ్ ఏమన్నారంటే?
సమ్మక్క, సారక్క గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలన్నీ నిండిపోయాయి. తిరుగువారం జాతర నాటికి మరో 25 హుండీలు కూడా నిండుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ హుండీ ఆదాయాన్ని ఎవరు తీసుకుంటారు? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ హుండీ ఆదాయాన్ని 1/3(33 శాతం) వంతు 13 మంది పూజారులకు, మిగిలిన(67 శాతం) హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖకు దక్కుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ తిరుగువారం జాతరకు భక్తులు వెళ్లుతున్న సంగతి తెలిసిందే.