Ramdev Baba: ఎంఐఎం.. బీజేపీకి బీ టీమ్? బాబా రాందేవ్ ఏమన్నారంటే?
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ పూర్వీకులు దేశ ద్రోహులంటూ ధ్వజమెత్తారు. బీజేపీకి అసదుద్దీన్ బీ టీమ్ అని చెప్పబోనని, కానీ, అసదుద్దీన్ ఎంత ఎక్కువ మాట్లాడితే మోడీకి అంత ప్రయోజనకరం అని వివరించారు.
యోగా గురువు బాబా రాందేవ్ ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గురించి, ప్రధాని మోడీ గురించి మాట్లాడిన ఆయన అసదుద్దీన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ బీ టీమ్ అనే ప్రచారం ఉన్నదని ఆయన కామెంట్ చేశారు. అయితే.. తాను ఆ మాట అనడం లేదని, కానీ, ఒక మాట తాను చెప్పదలిచినట్టు వివరించారు. అసదుద్దీన్ ఒవైసీ ఎంత ఎక్కువ మాట్లాడితే.. ప్రధాని మోడీకి అది అంతగా లబ్ది చేకూరుస్తుందని తెలిపారు.
దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్న డిమాండ్‌ను రాందేవ్ సమర్థించారు. ఆ డిమాండ్ సరైనదేనని పేర్కొన్నారు. ఒక దేశంలో ఒకే చట్టం ఉండటం సరైందని, భారత రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదేనని వివరించారు. ఈ యూనిఫాం సివిల్ కోడ్ ఉత్తరాఖండ్‌లో ప్రారంభం కావడం హర్షణీయం అని తెలిపారు. త్వరలో మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తాయని చెప్పారు. ఈ సందర్భంలోనూ ఆయన అసదుద్దీన్ పై కామెంట్ చేశారు.
Also Read: Bandla Ganesh: మంత్రి రోజాపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. డైమండ్ రాణి అంటూ ఫైర్
అసదుద్దీన్ ఒవైసీ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నారని, కానీ, అది సరికాదని బాబా రాందేవ్ అన్నారు. అసదుద్దీన్ మెలికల వ్యక్తి అని పేర్కొన్నారు. అసదుద్దీన్ పూర్వీకులు దేశ వ్యతిరేకులంటూ ఆగ్రహించారు. ఇంకా ప్రతిపక్ష నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. ప్రేళాపనలు చేస్తే అది మోడీకే కలిసి వస్తుందని తెలిపారు. అలాగైతే మోడీ కచ్చితంగా 400 సీట్లు గెలుచుకుంటాడని వివరించారు. అంతేకాదు, సెక్యులర్ అని చెప్పుకునే వ్యక్తి కంటే మూర్ఖుడు, అహేతుక వ్యక్తి మరొకరు ఉండరని అభిప్రాయపడ్డారు.