కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ఆసుపత్రులు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీలేవు అని ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్స్ ను నిరాకరిస్తుంటే... వయసు పైబడ్డది మేము చేర్చుకోమని అంటున్నారు ప్రభుత్వ వైద్యులు. 

కరోనా పేషెంట్స్ కి మాత్రమే కాదు. వయసుపైబడ్డవారిని కూడా చేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు ఆసుపత్రులు. తమ కళ్ళముందే కన్నవారి ప్రాణాలు పోతుంటే నిస్సహాయ స్థితిలో తల్లడిల్లిపోతున్నారు హైదరాబాద్ పరిధిలో నిన్న జరిగిన ఈ సంఘటనను చూస్తే కళ్ళు చెమర్చడం ఖాయం. 

ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నివాసముండే వసంత అనే ఒక మహిళా జులై 14 రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని తన కూతురికి ఫోన్ చేసింది. వెంటనే అంబులెన్సు తో అక్కడకు చేరుకొని తల్లిని ముషీరాబాద్ లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. 

డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో కవిత కుటుంబం

అక్కడ డాక్టర్లు ఆమెకు సీటీస్కాన్ తీసి ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ పేరుకుందని చెబుతూ ఆమెకు ట్రీట్మెంట్ ని నిరాకరించారు. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ ఆసుపత్రిలో 6 నుంచి 7 బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ..... తన  ట్రీట్మెంట్ నిరాకరించారని వసంత కూతురు వర్ష ఆవేదన వ్యక్తం చేసారు. జులై మొదటి వారంలో ఆమె కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చిందట. 

అక్కడి నుండి కోటి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే అక్కడ కూడా వారు 70 సంవత్సరాలపైబడినవారిని చేర్చుకోము అని చెప్పారట. ఆ రాత్రి 11.30 నుండి 5 గంటలపాటు అనేక ఆసుపత్రులకు ఫోన్లు చేసినప్పటికీ.... అందరూ బెడ్లు లేవనే తమని వెనక్కి పంపించారని అన్నారు. 

కోఠిలోని డాక్టర్లను తమ తల్లిని చేర్చుకోవాలని ప్రాధేయపడుతుండగానే అంబులెన్సు డ్రైవర్ వచ్చి ఆమె మరణించిందని చెప్పాడు. అప్పుడు సైతం డాక్టర్లు ఆమెకు ఎమెర్జెన్సీ గా అందించే ట్రీట్మెంట్ ను ఇవ్వడానికి కూడా ప్రయత్నించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. 

వయసుపైబడ్డవారంటే ఇంత చిన్నచూపా అని ఆమె రోదిస్తూ అడుగుతుంటే అక్కడున్నవారి కండ్లలో నీళ్లు తిరిగాయి. కన్నా తల్లి ప్రాణం కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ చివరికి కండ్ల ముందే ఆ తల్లి మరణిస్తుంటే చూస్తూ నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోవడం వంటి నిస్సహాయ స్థితి ఎవ్వరికి రావొద్దు అని అంటున్నారు.