ప్రేమ పేరుతో ఓ సైకో యువతిని దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా యువతి పనిచేసే జువెల్లరీ షాప్ లోనే ఈ దాడి జరిగింది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో మద్యం మత్తులో యువతిపు కత్తితో దాడిచేసి ఆపై చున్నీతో గొంతు బిగించి హతమార్చాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు పక్కనే పట్టపగలే ఈ దాడి జరగడం సంచలనంగా మారింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి(18) అనే యవతి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చింది. రెండు నెలల క్రితం యూసుప్ గూడ జవహర్‌నగర్‌ లోని జోడీ ష్యాషన్‌ జువెలరీలో షాపులో పనిచేస్తోంది.అయితే నిన్న ఈ షాప్ యజమానికి పని ఉండటంతో వేరే ప్రాంతానికి వెళ్లాడు. దీంతో యువతి షాప్ లో ఒక్కతే ఉండడాన్ని గమనించిన దుండగుడు దాడికి పాల్పడి హత్య చేశాడు.

వెంకట లక్ష్మిని గత సంవత్సర కాలంగా ప్రేమ పేరుతో సాగర్ అనే యువకుడు వెంటపడుతున్నాడు. సాగర్ పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే అతడి ప్రేమకు ఈమె అంగీకరించడం లేదు. దీంతో సాగర్ లక్ష్మిపై కోపాన్ని పెంచుకున్నాడు. తనను తిరస్కరించిన ఆమెను ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో నిన్న లక్ష్మి షాప్ లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న అతడు ఫాన్ లోనే యువతిపై బ్లేడ్ తో దాడి చేశాడు. ఆపై ఆమె చున్నీతోనే ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. సాగర్ తో పాటు ఈ దాడిలో మరో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం సాయంతో సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన బ్లేడును స్వాధీనం చేసుకున్నారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న
పోలీసులు అతడి నుండి సమాచారాన్ని రాబడుతున్నారు.