తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టా బయటికి... HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాంగ్మూలంలో సంచలనాలు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టా వెలుగులోకి వస్తున్నది. మొన్న సోమేశ్ కుమార్ పేరు బయటికి రాగా.. తాజాగా రజత్ కుమార్ పేరు వచ్చింది. అలాగే.. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరునూ శివబాలకృష్ణ తన కన్ఫెషన్‌లో పేర్కొన్నారు.
HMDA: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ అధికారుల ఆస్తుల చిట్టా వెలుగులోకి వస్తున్నాయి. హెచ్ఎండీఏ ఆస్తులను పరిశీలిస్తుండగా సంచలన విషయాలు అధికారుల దృష్టికి వచ్చాయి.
తెలంగాణలో పలువురు అధికారులు డీవోపీటీ అనుమతులు లేకుండా ఆస్తులు కొనుగోళ్లు చేసినట్టు తెలుస్తున్నది. మొన్న సోమేశ్ కుమార్ ఆస్తుల విషయం వెలుగులోకి రాగా.. తాజాగా రజత్ కుమార్ ఆస్తుల పేపర్లూ బయటికి వచ్చాయి. శివబాలకృష్ణ డాక్యుమెంట్లు పరిశీలిస్తుండగా.. తాజాగా రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్‌లోని హేమాజీపూర్‌లో 52 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 15 ఎకరాల కొనుగోలు చేసినట్టు తెలిసింది.
ఇక శివబాలకృష్ణ తన వాంగ్మూలంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తావించారు. శివబాలకృష్ణకు ఆదేశాలు జారీ చేసి అవసరమైన భూముల అనుమతులను అరవింద్ కుమార్ పొందినట్టు తెలిపినట్టు అధికారవర్గాలు వివరించాయి. అరవింద్ కుమార్ ఆదేశాలతో శివబాలకృష్ణ 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. నార్సింగిలోని ఓ కంపెనీ వివాదాస్పద భూమికీ క్లియరెన్స్ ఇచ్చారు.
Also Read: పీవీ ప్రధానిగా ఉండగా, అటల్‌ను ఐరాసకు పంపాడు.. తొలి తెలుగు బిడ్డకు భారత రత్న గర్వకారణం: కిషన్ రెడ్డి
ఎస్ఎస్‌వీ ప్రాజెక్ట్ అనుమతి కోసం అరవింద్ కుమార్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడని శివబాలకృష్ణ వెల్లడించారు. అందులో ఒక కోటి షేక్ సైదా అనే వ్యక్తికి వెళ్లాయని తెలిపారు. డిసెంబర్‌లో శివబాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్‌కు రూ. 1 కోటి అందినట్టు వివరించారు. మహేశ్వరంలో మరో బిల్డింగ్ కోసం అరవింద్ కుమార్ రూ. 1 కోటి డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఇక మంకల్ వద్ద గల వర్ట్ ఎక్స్ హోమ్స్‌కు అరవింద్ కుమార్ ఫేవర్ చేశారని వివరించారు. ఇందుకు ఫలితంగా అరవింద్ కుమార్‌కు ఒక ఫ్లాట్ బహుమానంగా పొందాడని తెలిపారు.