Asianet News TeluguAsianet News Telugu

పీవీ ప్రధానిగా ఉండగా, అటల్‌ను ఐరాసకు పంపాడు.. తొలి తెలుగు బిడ్డకు భారత రత్న గర్వకారణం: కిషన్ రెడ్డి

పీవీ నర్సింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని అన్నారు. కాంగ్రెస్ ఆయనను అవమానించినా.. ఒక శత్రువులా చూసినా.. దేశానికి ఎన్నో సేవలు అందించిన పీవీకి మోడీ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించిందని వివరించారు.
 

bjp govt announcing bharat ratna to pv narsimha rao pride for telugu people says kishan reddy kms
Author
First Published Feb 9, 2024, 2:49 PM IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ముగ్గురికి భారత రత్న అవార్డును ప్రకటించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు, మాజీ పీఎం చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఇది వరకే ఈ ఏడాదికి ఇద్దరిిక భారత రత్న అవార్డును కేంద్రం ప్రకటించింది. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ఈ అవార్డును ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర ప్రభుత్వం ముగ్గురికి భారత రత్న అవార్డును ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

జాకీర్ హుస్సేన్ తెలుగువాడైనా... ఆ తర్వాత యూపీకి వెళ్లాడని, ఆయనకు భారత రత్న వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. అయితే.. తొలి తెలుగు బిడ్డ మాత్రం పీవీ నర్సింహరావు మాత్రమేనని తెలిపారు. తెలుగు బిడ్డకు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు దక్కడం తెలుగు జాతికి గర్వకారణం అని వివరించారు. పీవీ కుటుంబానికి అభినందనలు తెలిపారు.

దేశ ప్రగతికి పునాదులు వేసిన, ప్రపంచ మార్కెట్‌ను భారత్‌లోకి ప్రోత్సహించడం, విదేశీ విధానం, విద్యారంగంలో విప్లవకర సంస్కరణలు పీవీ నర్సింహరావు తెచ్చాడని తెలిపారు. ఆయన రాజనీతిజ్ఞుడే కాదు, ఆర్థిక వేత్త, సాహిత్యాకారుడు, రచయిత, ఇంకా ఎన్నో రంగాల్లో ఆయన సేవలు అందించాడని కొనియాడారు. 

పీవీ నర్సింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నాడని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితికి ప్రతినిధిగా వాజ్‌పేయిని పంపించాడని వివరించారు. ఇంతటి గొప్ప ఆలోచనలు పీవీ సొంతం అని తెలిపారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పీవీ ఆదుకున్నాడని గుర్తు చేశారు.

Also Read: తెలంగాణలో అధికారుల ఆస్తుల చిట్టా బయటికి... HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వాంగ్మూలంలో సంచలనాలు

పీవీ నర్సింహరావు జీవిత కాలం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాడని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ, సోనియా గాంధీ మాత్రం ఆయనను గౌరవించలేదని, ఆయన కుటుంబ సభ్యులకూ గౌరవం ఇవ్వలేదని వివరించారు. పీవీ నర్సింహరావు తన జీవిత చరమాంకంలో ఎంతో క్షోభ అనుభవించాడని, కాంగ్రెస్ ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని బాధపడ్డాడని తెలిపారు. కాంగ్రెస్ ఆయనను అవమానించిందని చెప్పారు.

పీవీ ఢిల్లీలో మరణించినప్పుడు కనీసం పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా తీసుకెళ్లకుండా భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తరలించిందని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ఆయను అంతిమ సంస్కారాలు చేయడంలో అవమానించారని వివరించారు. ఢిల్లీలో ఆయనకు స్మారక కేంద్రం కడతామని కాంగ్రెస్ చెప్పిందని.. కానీ, ఇప్పటికీ స్మృతి కేంద్రాన్ని కట్టలేదని చెప్పారు. పోగా.. ఆయనను ఒక శత్రువుగానే చూసిందని ఆరోపించారు. 

యూపీకి చెందిన రైతు కుటుంబంలో జన్మించి దేశ ప్రధానిగా ఎదిగిన చరణ్ సింగ్‌కు భారత రత్న అవార్డును కేంద్రం ప్రకటించిందని కిషన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, నూతన వ్యవసాయ విధానం ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు భారత రత్న అవార్డు ప్రకటించడం అంటే.. దేశంలోని రైతులందరినీ గౌరవించినట్టేనని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios