హైదరాబాద్: సెల్‌ఫోన్ కోసం చోటు చేసుకొన్న వివాదం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ ఘటన హైద్రాబాద్ దిల్‌షుఖ్ నగర్ పీ అండ్ టీ కాలనీలో చోటు చేసుకొంది.

గౌలిపురా అయోధ్యనగర్ కు చెందిన వినయ్, రక్షాపురానికి చెందిన సందీప్, సంతోష్ స్నేహితులు. వినయ్‌కి పరిచయం ఉన్న వ్యక్తి నుండి  ఫోన్ ను సందీప్ లాక్కొన్నాడు.ఈ ఫోన్ ను తిరిగి అతనికి ఇవ్వాలని వినయ్  సందీప్ కు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం సందీప్ కు నచ్చలేదు.

దీంతో సందీప్ తన సోదరుడు సంతోష్ కు ఈ విషయం చెప్పాడు. వీరిద్దరూ కలిసి వినయ్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో వినయ్ లేడు.  కానీ తల్లికి వినయ్ ను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి వెళ్లిపోయారు.

ఇంటికి వచ్చిన తర్వాత తల్లి లలిత వినయ్ కు విషయం చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన వినయ్ సందీప్, సంతోష్ దిల్‌షుఖ్ నగర్ పీ అండ్ కాలనీలో ఉంటున్నట్టుగా తెలుసుకొన్నాడు.

బుధవారం నాడు రాత్రి ఒంటిగంటకు వారి ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకొంది.

కోపాన్ని తట్టుకోలేక సందీప్ తన వద్ద ఉన్న కత్తితో వినయ్ ను విచక్షణరహితంగా పొడిచాడు.  వినయ్ అక్కడికక్కడే మరణించాడు.  అంతేకాదు వినయ్ ను చంపేశామని  తల్లి లలితకు ఫోన్ చేసి చెప్పారు నిందితులు.

లలిత పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొనేసరికి వినయ్ మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వినయ్ పై రౌడీషీట్ కూడ ఉందని పోలీసులు తెలిపారు. సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.